సినిమా తారలు చాలా రకాల ప్రోడక్ట్‌లకు ప్రచారం చేస్తుంటారు. డబ్బులు తీసుకుని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ వస్తున్నారు. అయితే వాళ్లు ప్రచారం చేసిన ప్రోడెక్ట్‌లు, సర్వీసుల గురించి వాళ్లకు ఎంతవరకు సంబంధం.. అందులో వచ్చే సమస్యలు, ఇబ్బందులకు వాళ్లు ఎంతవరకు బాధ్యులు అనే ప్రశ్న చాలా ఏళ్లుగా వినిపిస్తూ వస్తోంది. కేవలం ప్రచారం చేసినందుకు ఇబ్బందులు పడాలా అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి వస్తోంది. ఈసారి ఆ ఇబ్బంది పడబోతున్నది ప్రముఖ కథానాయికలు తమన్నా (Tamannaah) , కాజల్ (Kajal Aggarwal).
పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి తమన్నా, కాజల్‌ను పోలీసులు విచారించనున్నారని సమాచారం. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. లాభాలు ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ.2.4 కోట్లు వసూలు చేశారని అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని మీద విచారణ ప్రారంభమైంది.
క్రిప్టో కరెన్సీ కంపెనీకి సంబంధించిన మెయిన్ బ్రాంచ్ 2022లో కోయంబత్తూరులో ప్రారంభమైంది. ఆ కార్యక్రమంలో తమన్నా అతిథిగా పాల్గొంది. మహాబలిపురంలోని ఓ హోటల్‌లో జరిగిన కంపెనీ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. ఆ తర్వాతనే ముంబయిలో ఓ భారీ పార్టీ నిర్వహించి వేలాది మంది నుండి డబ్బులు సేకరించారు. క్రిప్టో కరెన్సీ విషయంలో తమన్నా, కాజల్‌కు సంబంధం ఉందని ఫిర్యాదు చేశారు.
ఇక ఈ కేసు విషయం చూస్తే.. నితీష్ జెయిన్, అరవింద్ కుమార్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తమన్నా, కాజల్‌ను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే వచ్చిన ప్రతి సర్వీసు, ప్రొడెక్ట్‌కి యాడ్స్ చేయడానికి, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి సినిమా తారలు భయపడే రోజులు వస్తాయి.