కష్టాలు పడి.. కన్నీళ్లు మింగి, అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగి చివరికి సినిమాల్లో ఛాన్స్‌లు సంపాదించే నటీనటులు ఆ తర్వాత ఆకాశమే హద్దుగా సక్సెస్‌లు అందుకుంటారు. వృత్తి జీవితంలో ఎంతో స్థాయికి ఎదిగిన ఎందరో సినీనటులు ఆత్మీయులు, పరిచయస్తుల చేతిలోనే మోసపోయిన దాఖలాలు ఎన్నో. ఈ లిస్ట్‌లో సూపర్‌స్టార్‌లు, బడా హీరోయిన్లు, దర్శకులు వున్నారు. కానీ వాళ్లని ఏమి అనలేక తమ చేతిగాని తనానికి తామే సిగ్గుపడుతూ మౌనం దాలుస్తూ వుంటారు.
ఇలాంటి వారిలో నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణీ కూడా ఒకరు. తండ్రిగా, గురువుగా, బాబాయిగా, మావయ్యగా ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన తనికెళ్ల భరణీని స్వయంగా సినీ రంగంలోని వ్యక్తే మోసం చేశాడట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లై హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నటుడు రాళ్లపల్లి ఇంటిలో వుండేవారమని.. అయితే ఓ రోజున ఫైట్ మాస్టర్ భీమరాజు తనను కలిసి తనకు పెద్ద ఇల్లు వుందని.. గ్రౌండ్ ఫ్లోర్ అమ్ముతాను అని చెప్పాడట. అయితే దాని ధర రూ.3 లక్షలు అని చెప్పాడట రాజ.
తాను అప్పుడప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకుంటున్న సమయంలో అంత పెద్ద మొత్తం తీసుకురాలేనని చెప్పగా.. ముందు నువ్వు వచ్చి ఇంట్లో దిగు తర్వాత డబ్బులు ఇద్దువుగానీ అన్నారట. అయితే ఒక లక్ష రూపాయలు అతనికిచ్చి ఆ ఇంట్లో వున్నానని భరణీ చెప్పారు. కానీ ఆరు నెలల పాటు తనకు ఎలాంటి డబ్బు అందకపోవడంతో భీమరాజు వచ్చి ఉన్నపళంగా మొత్తం డబ్బు కట్టాలని ఒత్తిడి చేశారని… తన పరిస్ధితి చెప్పినప్పటికీ ఉన్నపళంగా డబ్బు కట్టాలని ఇల్లు ఖాళీ చేసి వెళ్లమన్నారని భరణీ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతమాట అనేసరికి తనికెళ్ల భరణీ కూడా మారు మాట్లాడకుండా తాను ముందు ఇచ్చిన లక్ష తనకు తిరిగి ఇవ్వాలని అడిగాడట. కానీ రూపాయి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో వేరే ఇంటికి వెళ్లిపోయినా తనికెళ్ల భరణీ తన డబ్బు కోసం ప్రయత్నాలు చేశారట. అలా 75 వేల వరకు తిరిగి తీసుకున్నానని.. అయితే భీమరాజుకు పక్షవాతం రావడంతో మానవత్వంతో మిగిలిన పాతిక వేలు వదిలేశానని చెప్పారు తనికెళ్ల భరరణీ.