ఒకరి పరాజయం వల్ల మరొకరికీ విజయాన్ని ఇవ్వడం అనేది అనాధిగా జరుగుతున్న సంస్కృతి. వేరే ఇండస్ట్రీల్లో ఈ పద్ధతిని ఎంతవరకూ వాడుకొంటారో తెలియదు కానీ.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ తరహా విజయాల్ని భీభత్సంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ తరహా విజయాన్నే ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మనోడి “టాక్సీవాలా” నిజానికి నవంబర్ 16న విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ.. రవితేజ “అమర్ అక్బర్ ఆంటోనీ” కోసమని నవంబర్ 17కి పోస్ట్ పోన్ చేశారు. అసలే పైరసీ భూతం పట్టి పీడిస్తున్న చిత్రమాయే, అందులోనూ శనివారం రిలీజ్ అంటే ఇక కష్టమేనేమో అనుకున్నారు. అందులోనూ యువీ క్రియేషన్స్ నుంచి వచ్చిన మునుపటి డిజాస్టర్ “హ్యాపీ వెడ్డింగ్” శనివారం విడుదలైంది. ఆ సెంటిమెంట్ పుణ్యమా అని ఈ సినిమా కూడా పోతుందేమో అనుకున్నారు జనాలు.
కట్ చేస్తే.. కాసిన్ని అంచనాల నడుమ విడుదలైన “అమర్ అక్బర్ ఆంటోనీ” డిజాస్టర్ గా నిలవడం, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన “టాక్సీవాలా” కంటెంట్ మరియు కామెడీ జనాలకి విపరీతంగా నచ్చేయడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మొదటి రెండు రోజుల్లోనే పది కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ ని సేఫ్ జోన్ లో పడేసిన ఈ చిత్రం వచ్చే శుక్రవారంలోపు అందరినీ లాభాల బాటన పడేయడం కన్ఫర్మ్. ఇది హీరో స్టార్ డమ్ కి వచ్చిన సక్సెస్సా లేక డైరెక్టర్ విజన్ కి దక్కిన విజయమా అనేది పక్కన పెడితే.. టీం ఎఫర్ట్ ఫలించింది. ఇండస్ట్రీకి లాభాలు తీసుకొచ్చిన మరో సినిమాగా “టాక్సీవాలా” నిలిచింది.