గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి జరగనీయకుండా అడుగడుగునా అడ్డుపడింది. ఈ విషయంలో తెలుగు సినిమా ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ప్రదర్శించాలన్నా, ప్రత్యేక షోలు వేయాలన్నా, పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచాలన్నా ఎక్కడా ఎలాంటి అనువైన పరిస్థితుల్ని కల్పించలేదు ప్రభుత్వం. అయితే ఇప్పుడు సినిమా ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలో విశాఖపట్నం సినిమా హబ్‌గా మారే అవకాశం కూడా వస్తోంది.
భీమిలి తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల మీడియాతో మాట్లాడారు. ప్రముఖ నిర్మాతలు, కె.ఎస్.రామారావు, అశోక్‌కుమార్‌లతో కలిసి గంటా శ్రీనివాసరావు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీలో ఏర్పాటు చేయాల్సిన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ గురించి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్ల చేసినా వైఎస్ జగన్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేని అన్నారు.
ఇంతకీ ఏమైందంటే.. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాద్ తరహాలోనే ఏపీలోనూ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పెట్టాలనుకున్నారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. తొట్లకొండపై 15 ఎకరాలు కేటాయించారు కూడా. అయితే భవనం కోసం భూమి పూజ చేసే సమయంలో అక్కడ బౌద్ధులకు సంబంధించిన కట్టడాలు ఉన్నాయని చెప్పడంతో వివాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుందని భవనం విషయంలో ముందుకు వెళ్లకుండా ఆగిపోయారు.
ఆ తర్వాత సుదీర్ఘ చర్చల అనంతరం రామానాయుడు స్టూడియోకి దగ్గర్లో ఐదు ఎకరాలు కేటాయించారు. సరిగ్గా ఆ సమయంలోనే ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఆ తర్వాత ఈ విషయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉందని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చెప్పారు. కొత్త కమిటీతో కలసి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, సీఎం చంద్రబాబును సంప్రదిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో సినిమాల చిత్రీకరణలకు, ఇతర సినిమా సంబంధిత కార్యక్రమాలకు విశాఖపట్నం హబ్‌గా మారుతుందని గంట శ్రీనివాసరావు చెప్పారు.