తెలంగాణకు అతి పెద్ద తలనొప్పిగా మారిన డ్రగ్స్, సైబర్ నేరాలు అరికట్టే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పాలి. సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం కట్టడిపై అవగాహన కల్పించాలని తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు సూచించారు. దీనికి సంబంధించి వీడియోలను థియేటర్‌లలో కచ్చితంగా ప్రదర్శించాలని చెప్పారు. అంతేకాదు అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామని కూడా చెప్పారు.
డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం నాడు ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) ఓ అవగాహన వీడియోను చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్.. మిగిలిన వాళ్లూ ఇదే పని చేయాలని కోరారు. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. అయితే సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ లాంటి సామాజిక సమస్యల గురించి మీ వంతు బాధ్యత వహించడం లేదు అనిపిస్తోంది అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్.
ఇకపై ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్నప్పుడు టికెట్ ధరలు పెంపు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నప్పుడే డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన కల్పించేలా ఓ వీడియో చేయాలి అని తేల్చి చెప్పారు. మీ సినిమాలోని స్టార్స్‌తో ఆ వీడియో రూపొందించాల్సిందే అని షరతు పెట్టారు సీఎం. లేకపోతే ప్రత్యేక షోల వెసులుబాటు, రాయితీలు ఇవ్వద్దు అని తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్. సమాజం నుండి సినిమా వాళ్లు ఎంతో తీసుకుంటున్నారు మరి సమాజానికి వాళ్లు కొంతైనా ఇవ్వాలి కదా అని అన్నారు.
సినిమా కోసం రూ. వందల కోట్లు పెట్టుబడు పెట్టి టికెట్లు రేట్లు పెంచుకుని, డబ్బులు తిరిగి సంపాదించుకుంటామన్న ఆలోచన మంచిదే కానీ అలాంటి వ్యాపారంతో సామాజిక బాధ్యత కూడా ఉండాలి కదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. అక్కడితో ఆయన ఆగకుండా సినిమా షూటింగ్‌ల అనుమతి కోసం వచ్చినప్పుడే ఈ సూచన చేయాలని పోలీస్ శాఖను కోరారు సీఎం రేవంత్. మరి ఇండస్ట్రీ ఈ విషయంలో ఓలా స్పందిస్తుందో చూడాలి.