కొన్ని దశాబ్దాలుగా తెలుగు అమ్మాయిలు చేస్తున్న ఒకే ఒక్క కంప్లైంట్. ‘తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు తెలుగమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సులు ఇవ్వడం లేదు’ అని..! దానికి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. కొంతమంది ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి స్టార్ స్టేటస్ దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. లయ వంటి హీరోయిన్లు ఈ లిస్టులో ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ను.. ఓ ఊపు ఊపిన చాలా మంది స్టార్ హీరోయిన్లు తెలుగు వాళ్ళే. అయినా ఈ కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి.? అంటే తేజ వంటి దర్శకులు చెప్పే మాట ఏంటంటే.. ‘తెలుగు అమ్మాయిలకు ఓపిక ఉండదు. వాళ్లకి చిన్న సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ ఇద్దామని అనుకుంటే.. వాళ్ళు ఓపిగ్గా వెయిట్ చేయకుండా.. పెద్ద సినిమాల్లో వచ్చే చిన్న పాత్రలకు ఓకే చెప్పేసి.. చిన్న సినిమాలను అవాయిడ్ చేశారు. పైగా పేమెంట్ల విషయంలో కూడా వాళ్ళ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ముంబై అమ్మాయిలను తీసుకొస్తూ ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చారు.
అయితే మన తెలుగు అమ్మాయిలకు తమిళంలో మాత్రం మంచి అవకాశాలే వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. గతంలో అంజలినే తీసుకుందాం. ఆమె తెలుగులో ‘ఫోటో’ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయ్యింది. కానీ తర్వాత ఆమెకు ఇక్కడ అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో ‘షాపింగ్ మాల్’ ‘జర్నీ’ వంటి సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు దక్కించుకుంది. అవి హిట్ అయిన తర్వాత తెలుగులో ఆమెకు పెద్ద సినిమా అవకాశాలు లభించాయి. ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. చాలా మంది తెలుగమ్మాయిలు తమిళంలో క్రేజీ హీరోయిన్లుగా ఎదిగారు.
‘రైటర్ పద్మభూషణ్’ ‘మ్యాడ్’ సినిమాల్లో నటించిన శ్రీ గౌరీ ప్రియని ఇక్కడి ఫిలిం మేకర్స్ పట్టించుకోలేదు. కానీ తమిళంలో ‘లవర్’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. అది హిట్ అయ్యింది. తర్వాత ‘మోడ్రన్ లవ్ చెన్నై’ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఇప్పుడు జయం రవి నటిస్తున్న ‘బ్రో కోడ్’ లో మెయిన్ రోల్ చేసింది.
అలాగే ‘పుష్పక విమానం’ సినిమాలో హీరోయిన్ గా చేసిన శాన్వీ మేఘనని కూడా తెలుగు ఫిలిం మేకర్స్ పట్టించుకోలేదు. కానీ తమిళ్ లో ‘కుటుంబస్థాన్’ వంటి సినిమాలో నటించి అక్కడ పాపులర్ అయిపోయింది. అలాగే సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ‘విళి వీకుర’ మ్యూజిక్ వీడియోలో పెర్ఫార్మ్ చేసి దేశమంతా పాపులర్ అయిపోయింది.
‘బబుల్ గమ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మానస చౌదరిని తెలుగు దర్శకులు, నిర్మాతలు ఫోకస్ చేయలేదు. కానీ తమిళంలో ‘DNA’ అనే సినిమాలో నటించింది. అది సూపర్ హిట్ అయ్యింది. అలాగే ‘ఆర్యన్’ అనే మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో నటించింది. దానిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇలా మన తెలుగమ్మాయిల టాలెంట్ ను తమిళ ఫిలిం మేకర్స్ బాగా గుర్తించి వాళ్ళకి మంచి బ్రేక్ ఇస్తున్నారు.
