కొన్ని సినిమాలు కాంబినేషన్లతో అంచనాలు పెంచితే, ఇంకొన్ని ప్రమోషనల్ కంటెంట్ తో పెంచుతాయి. కొన్ని ఆ అంచనాలను అందుకోగలిగితే, ఇంకొన్ని ఆ అంచనాలను తొక్కి, ప్రేక్షకుల్ని ఇబ్బందిపెడతాయి. అలా 2025లో ప్రేక్షకుల్ని నిరాశపరిచిన సినిమాలేంటో చూద్దాం.
గమనిక: ఇది ఫ్లాప్ సినిమాల లిస్ట్ కాదు, పైన పేర్కొన్నట్లు కాంబినేషన్ లేదా కంటెంట్ తో ఎంగేజ్ చేసి.. థియేటర్లో నిరాశపరిచిన సినిమాల లిస్ట్.
1) గేమ్ ఛేంజర్

ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా లేకపోయినా.. ట్రైలర్ కాస్త బెటర్ అనిపించింది. శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడి నుండి వస్తున్న సినిమా కావడం, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే.. ఆ అంచనాలను అందుకోవడంలో బొక్కబోర్లాపడింది “గేమ్ ఛేంజర్”. సమస్య మొత్తం శంకర్ తీత లోనే ఉందని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
OTT Platform: Prime Video
2) లైలా

ఈ ఏడాది వచ్చిన వరస్ట్ సినిమాల్లో నెం.1 గా నిలిచేందుకు అన్నీ లక్షణాలు ఉన్న సినిమా ఇది. ప్రతీ విషయంలోనూ ఇది డిజాస్టర్ సినిమాగానే కనిపిస్తుంది. లేడీ గెటప్ లో విశ్వక్ చేసే లేకి పనులు, డబుల్ మీనింగ్ జోకులు, అనవసరమైన హీరోయిన్ ఎక్స్ పోజింగులు. అన్నీ కలిపి ఈ చిత్రాన్ని అన్నీ వర్గాల ప్రేక్షకులు సామూహికంగా హిట్ చేసేలా చేశాయి.
OTT Platform: Prime Video
3) రాబిన్ హుడ్

వెంకీ కుడుముల ట్రాక్ రికార్డ్, నితిన్ ట్రాక్ రికార్డ్ కి సింక్ అవ్వకపోయినా.. ట్రైలర్ ఓ మోస్తరుగా అలరించేసరికి.. ఇదేదో బాగుండేలా ఉంది అనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. సినిమా దారుణంగా నిరాశపరిచింది. కథలోనే దమ్ము లేకపోవడంతో, ఆ జోకులు ఏమాత్రం పేలలేదు.
OTT Platform: Netflix
4) జాక్

సిద్ధు జొన్నలగడ్డ సినిమా కావడం, మినిమం గ్యారెంటీ సినిమా అయ్యింటుంది అనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. బొమ్మరిల్లు భాస్కర్ టేకింగ్ ఈ సినిమాని కిల్ చేసింది. ట్రైలర్ చూసినప్పుడు అఖిల్ “ఏజెంట్” సినిమాని సరిగ్గా తీస్తే ఇలా ఉంటుంది అనిపించింది కానీ.. సినిమా దానికన్నా అధ్వాన్నంగా ఉండడం గమనార్హం. ఇక ప్రొడక్షన్ డిజైన్, సీజీ అయితే షార్ట్ ఫిలిమ్స్ కంటే దారుణంగా ఉండడం విశేషం.
OTT Platform: Prime Video
5) ఓదెల 2

దైవత్వాన్ని, కామాన్ని కలగలిపి కమర్షియల్ సినిమాలా తెరకెక్కిద్దామనే సంపత్ నంది ఆలోచన దారుణంగా బెడిసికొట్టింది. గ్రాఫిక్స్ డీసెంట్ గా ఉన్నప్పటికీ.. కథలో అనవసరమైన క్రూరత్వం కోసం హింసాత్మక సన్నివేశాలని ఇరికించిన విధానం మైనస్ అయ్యింది. అందువల్ల అఘోరిగా తమన్నా ఎంత కష్టపడినా ఉపయోగం లేకుండాపోయింది.
OTT Platform: Prime Video
6) అర్జున్ సన్నాఫ్ వైజయంతి

మేకర్స్ క్లైమాక్స్ అదిరిపోద్ది, ఊహించని విధంగా ఉంటుంది అనేసరికి. మాస్ సినిమాల్లో అంత ఎగ్జైట్ చేసే క్లైమాక్స్ ఏముంటుందా? అనుకున్న జనాలకి షాక్ ఇచ్చిన క్లైమాక్స్ సీన్ తెగ ట్రోల్ అయ్యింది. ఆ చెయ్యి బదులు చైన్ నరకొచ్చు కదా అనే అందరూ వాదించారు. అప్పటివరకు గేట్లు కూలిపోయేలా విలన్లను కొట్టిన హీరో సింపుల్ సంకెళ్లను తెంచలేకపోవడం అనేది సింక్ అవ్వలేదు.
OTT Platform: Prime Video
7) కొత్తపల్లిలో ఒకప్పుడు

తెలుగు సినిమాకి ప్రేమలేఖ అంటూ “కేరాఫ్ కంచరపాలెం” నిర్మాత ప్రవీణ పరుచూరి తెరకెక్కించిన చిత్రం “కొత్తపల్లిలో ఒకప్పుడు”. కథగా ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. కథనం ఆసక్తికరంగా లేకపోవడం, సినిమా మొత్తం అనమార్ఫిక్ లెన్స్ లో షూట్ చేయడం వల్ల బ్లర్ ఎఫెక్ట్ ఎక్కువై.. సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను కూడా దెబ్బతీసింది.
OTT Platform: Aha
8) హరిహర వీరమల్లు

క్రిష్ దర్శకుడిగా ఉన్నప్పుడు వచ్చిన ఎనౌన్స్మెంట్ వీడియో తప్ప.. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఏదీ పెద్దగా ఎగ్జైట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక ఫాంటసీ సినిమాలో నటించడం హైలైట్ అనుకుంటే.. షూటింగ్ ఏళ్ల తరబడి జరగడం, రిలీజ్ వరకు కూడా ఎన్నో ఆటుపోట్లు. ఫస్టాఫ్ బాగానే ఉంది అనుకునేలోపు.. సెకండాఫ్ తో సినిమాని అటకెక్కించారు.
OTT Platform: Prime Video
9) కింగ్డమ్

విజయ్ దేవరకొండకి కమ్ బ్యాక్ సినిమా అవుతుంది అనుకున్నారు జనాలు. “జెర్సీ” దర్శకుడు గౌతమ్ దర్శకత్వం వహించడం, అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి పొటెన్షియల్ పాయింట్స్ కాగా.. ప్రమోషన్స్ సినిమాని సైడ్ ట్రాక్ చేశాయి. చాలా ఆశలతో సినిమా చూసిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.
OTT Platform: Netflix
10) పరదా

ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఇన్వాల్వ్మెంట్ చూసి.. ఒక హీరోయిన్ ఈస్థాయిలో ప్రొడక్ట్ ను నమ్మింది అంటే ఎంత మంచి సినిమానో అనుకున్నారు ఆడియన్స్. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ట్రాక్ రికార్డ్ కూడా అందుకు కారణం. కట్ చేస్తే.. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మంచి ప్రయత్నమే కానీ.. ఇంకాస్త బాగా తీసే అవకాశం పుష్కలంగా ఉంది.
OTT Platform: Prime Video
11) తమ్ముడు

అప్పటికి చాలా డౌన్ లో ఉన్న నితిన్ కెరీర్ కి “తమ్ముడు” సినిమా ఒక హోప్ అనుకున్నారు. ట్రైలర్ కూడా బాగుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, పాయింట్ కూడా కొత్తగా ఉండడంతో.. పక్కా హిట్ అనుకున్నారు. కట్ చేస్తే.. సినిమాని తెరకెక్కించిన విధానం, సినిమాలో లాజిక్స్ ఏమాత్రం అలరించలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
OTT Platform: Netflix
12) ఘాటి

క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ కానీ, గ్రాఫిక్స్ కానీ సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచాయి. ఖర్చు విషయంలో కాస్త కంటెంట్ తగ్గట్లుగా పెట్టి ఉంటే బాగుండేది. ముఖ్యంగా అనుష్క లుక్స్ & ఆమె ఫిజిక్ ను అందంగా చూపించడానికి వాడిన గ్రాఫిక్స్ చాలా పేలవంగా ఉన్నాయి.
OTT Platform: Prime Video
13) మిత్ర మండలి

“జాతి రత్నాలు” రేంజ్ సినిమా అని ప్రమోట్ చేయబడి, రెండు గంటల సినిమాలో కనీసం 10 నిమిషాల పాటు కూడా నవ్వించలేకపోయింది. పాపం నిర్మాతలకి 6 కోట్ల రూపాయల నష్టం, ప్రేక్షకులకి తలనొప్పి తప్ప ఏమీ మిగలలేదు.
OTT Platform: Prime Video
14) తెలుసు కదా

నీరజ కోన డైరెక్షనల్ డెబ్యూ సినిమా కావడం, సిద్ధు జొన్నలగడ్డ హీరో అవ్వడం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ఇదేదో బాగుంటుంది అనుకున్నారు. అయితే.. సినిమాని డీల్ చేసిన విధానం చాలామందికి ఎక్కలేదు. ముఖ్యంగా తమన్ బీజియం మైనస్ అయ్యింది. ఇక సిద్ధు ప్లే చేసిన క్యారెక్టర్ ని అందరూ ముక్తకంఠంతో హేట్ చేసారు.
OTT Platform: Netflix
15) మాస్ జాతర

వింటేజ్ రవితను చూపిస్తాం అని డైరెక్టర్ భాను, ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పినప్పటికీ.. సినిమా మాత్రం బాగా నిరాశపరిచింది. కథ, కథనం, హీరో క్యారెక్టరైజేషన్, హీరో తెలంగాణ యాస, భీమ్స్ నేపధ్య సంగీతం.. ఇలా చాలా మైనస్ లు ఉన్నాయి సినిమాకి.
OTT Platform: Netflix
16) మోగ్లీ

“కలర్ ఫోటో” ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్, బండి సంజయ్ యాంటీ హీరో అనేసరికి సినిమా మీద కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ.. రొటీన్ ఫార్మాట్ సినిమా కావడం సినిమాకి మైనస్ గా మారింది. ఇక టెక్నికల్ గానూ సినిమాలో చాలా లోటుపాట్లు ఉన్నాయి.
OTT Platform: Etv Win
