ప్రముఖ బాలీవుడ్ నటుడు, టాక్ అండ్ రియాలిటీ షో హోస్ట్ కపిల్ శర్మకి చెందిన కేఫ్ దగ్గర కాల్పుల కలకలకం చోటు చేసుకుంది. కెనడాలో కొన్ని రోజుల క్రితం కపిల్ శర్మ ‘కాప్స్ కేఫ్’ను ప్రారంభించాడు. దాని మీదనే ఇప్పుడు కాల్పులు జరిగాయి. తొలుత ఈ కాల్పుల వెనుక ఉగ్రదాడి కారణమవ్వొచ్చు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రమాదమేమో అనుకున్నారంతా.
అయితే తానే కాల్పులు జరిపినట్లు ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లద్ధీ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కపిల్ శర్మ సర్రే ప్రాంతంలో తన కేఫ్ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. కపిల్ భార్య గిన్ని ఆ కేఫ్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయి. ఇక ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వ్యక్తి కారులో కేఫ్ దగ్గరకు వచ్చి గన్‌ఫైర్ చేస్తుండడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది.
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన హర్జిత్ ఉగ్రవాద నిరోధక విభాగం ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ టెరరిస్ట్ అనే విషయం తెలిసిందే. విశ్వ హిందూ పరిషత్ నాయకుడు వికాశ్ ప్రభాకర్ అలియాస్ వికాస్ బగ్గా ఈ ఏడాది ప్రారంభంలో హత్యకు గురయ్యారు. ఆ ఘటనకు హర్జిత్‌కు సంబంధం ఉందని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఈ మేరకు ఛార్జిషీట్ కూడా ఫైల్ చేసింది. ఇక కపిల్ శర్మ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల విషయంలో హర్జిత్ అసంతృప్తితో ఉన్నాడట. ఈ నేపథ్యంలో కాల్పులకు తెగబడ్డాడు అని ప్రాథమిక సమాచారం.