టాలీవుడ్‌లో ఎవరైనా, ఏదైనా ఘనత సాధిస్తే వాటిని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడు టాలీవుడ్‌లో సెప్టెంబరులో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ప్రముఖ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి అనుమతులు వచ్చేశాయట. బాలకృస్ణ సినీ ప్రయాణం జులై 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఆయన తొలి సినిమా ‘తాతమ్మ కల’ ఆగస్టు 30, 1974న విడుదలైంది.
అప్పటి నుండి ఆయన బాల నటుడిగా కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత కథానాయకుడిగ మారి తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దాంతోపాటు తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి హిందూపురం ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా సేవా రంగంపైనా తనదైన ముద్ర వేశారు. ఈ అన్ని ఘనతల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబరు 1న ఘనంగా సన్మానించనుంది.
ఈ మేరకు తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ (K L Damodar Prasad) , తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ బాలకృష్ణని కలిశారట. మిమ్మల్ని సన్మానం చేయాలని అనుకుంటున్నామని, మీరు ఓకే అంటే వేడుక ఏర్పాటుకు అన్నీ సిద్ధం చేస్తాం అని అడిగి, అంగీకారం తీసుకున్నారట.
ఈ సన్మాన వేడుకకు భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరవుతారట. ఈ మేరకు టి.ప్రసన్నకుమార్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. భారీ స్థాయిలో ఈ వేడుకలకు పనులు ఉంటాయట. త్వరలో మరిన్ని విషయాలు తెలియొచ్చు. బాలయ్య సినిమాల సంగతి చూస్తే.. ఇప్పుడు బాబీతో (Bobby) ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో (Boyapati Srinu) సినిమా ఉంటుంది.