The Indrani Mukerjea Story Buried Truth OTT: ఓటీటీలోకి వస్తోన్న సంచలన ‘షీనా బోరా కేసు’.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు మీకు గుర్తుందా? కొన్నాళ్లపాటు వార్తల్లో నిలిచిన కేసు ఇది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు లాంటి అనేక ప్రశ్నలు ఆ రోజుల్లో వినిపించాయి. సగటు ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ సినిమాకు ఏ మాత్రం తగ్గని విధంగా ఆ కేసు నడిచింది. విచారణలో భాగంగా బయటకు వచ్చిన విషయాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఈ మొత్తం వ్యవహారంలో ఓటీటీలో చూపించబోతున్నారు.

షీనా బోరా హత్య కేసు విషయంలో ఓ డాక్యుమెంటరీ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌’ (The Indrani Mukerjea Story Buried Truth) పేరుతో ఈ డాక్యుమెంటరీని సిద్ధం చేశారు. ఫిబ్రవరి 24 నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. షానా లెవీ, ఉరాజ్ బహల్‌ తదితరులు ఈ డాక్యుమెంటరీలో కీలక పాత్రలు పోషించారు. సుదీర్ఘ కాలం నడిచిన ఈ కేసు గురించి ఏం చూపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

2012లో షీనా బోరా హత్య జరగ్గా మూడేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టు అయిన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా షీనా బోరా హత్య కేసు గురించి బయటపెట్టాడు. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని ఆయన తెలిపాడు. దీంతో ఈ కేసు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ కేసు విషయంలో దర్యాప్తు వేగం పెంచారు. దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం..

ఇంద్రాణీ మొదటి భర్త నుండి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గౌహతిలోని తల్లిదండ్రుల వద్ద ఉంచేశారు. అక్కడికి కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని, అతడి నుండి ఆ తర్వాత విడిపోయింది. కొన్నాళ్ల తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జియాను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా ముంబయికి వెళ్లి ఆమెను కలిసింది. ఆ తర్వాత పీటర్‌ మొదటి భార్య కుమారుడు రాహుల్‌తో షీనాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది.

ఈ విషయంలో తల్లీ కుమార్తెల మధ్య తరచూ గొడవలు జరిగేవట. ఆ తర్వాత ఆర్థిక విభేదాలూ తలెత్తాయి. దీంతో ఈ విషయంలో విసిగిపోయిన ఇంద్రాణీ తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు ఆ మృతదేహాన్ని రాయ్‌గఢ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేశారట. ఇక ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌తో పాటు పీటర్‌ని అరెస్టు చేశారు. మరోవైపు జైల్లోనే ఇంద్రాణీ, పీటర్ 2019లో విడాకులు తీసుకున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus