రామ్‌చరణ్ – శంకర్ — దిల్ రాజు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా అనౌన్స్‌మెంట్ నుండి కథపై రకరకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ అని, కరప్షన్ బ్యాక్‌డ్రాప్ అని… ఇలా చాలా రకాల చర్చలు నడిచాయి. అయితే దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో మాత్రం ఇదేదో ప్రభుత్వ ఉద్యోగుల బ్యాక్‌డ్రాప్ అని మాత్రం అర్థమైంది.
సినిమా కథేంటి అనే విషయంలో చర్చలు అలానే నడుస్తున్నాయి. అయితే ఈ కథ రాసింది ఎవరు అనేది మాత్రం ఇప్పుడు బయటకొచ్చింది. ప్రముఖ దర్శకుడు, శంకర్ శిష్యుడు అయిన కార్తిక్ సుబ్బరాజు ఈ కథ అందించారట. ‘పిజ్జా’, ‘పేట’, ‘పెంగ్విన్’, ‘మహాన్’ వంటి సినిమాలు తెరకెక్కించిన కార్తిక్ సుబ్బరాజే శంకర్ – రామ్ చరణ్ సినిమాకు స్టోరీ ఇచ్చారట. ‘మహాన్’ సినిమా ప్రచారంలో భాగంగా కార్తిక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
రామ్‌చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి కథ ఇచ్చాను. పూర్తిస్థాయి రాజకీయ కోణంలో సాగే సినిమా అది. నేను రాసిన కథ శంకర్ సర్‌కి నచ్చింది. ఆయన సినిమాకు అవసరమైనట్టుగా మార్చుకొని తెరకెక్కిస్తున్నారు. దాంతోపాటు ఈ సినిమా కోసం శంకర్‌తో అసోసియేట్ కావడం గర్వంగా ఉంది అంటూ ఆనందపడిపోయాడు కార్తిక్ సుబ్బరాజు. దిల్ రాజు ప్రొడక్షన్‌లో 50వ సినిమా రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా గురించి వస్తున్న పుకార్లకు, ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజు చెప్పిన మాటలు వింటుంటే…
ఈ సినిమా పొలిటికల్ తేనెతుట్టె కదిపేలాగే ఉంది. ప్రభుత్వ వ్యవస్థల్లోని కీలక పోస్టుల్లో ఉన్న వారి గురించో, లేక ప్రభుత్వ విధానాలపైనో ఈ సినిమా సిద్ధం చేసినట్లున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, వాటితో మెగా కుటుంబానికి ఉన్న అనుబంధం నేపథ్యంలో విమర్శలు, వివాదాలు అంత మంచివి కావు. మరి చరణ్ ఏం చేస్తాడో చూడాలి.