ప్రభాస్ (Prabhas) నటిస్తున్న హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ (The Raja saab) గురించి తాజా అప్‌డేట్స్ అభిమానుల్లో మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి.. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అనేక మార్పులు జరుగుతూనే ఉన్నాయి. తొలుత ఏప్రిల్ 10 విడుదలకు ప్లాన్ చేసిన మేకర్స్, ఇప్పుడు మరోసారి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ దాదాపుగా పూర్తైనప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు భారీగా ఉన్నాయట.
హారర్ కాన్సెప్ట్ కావడం, మరీ ముఖ్యంగా భయపెట్టే ఎలిమెంట్స్‌ను హైలైట్ చేయాలంటే గ్రాఫిక్స్ ప్రాముఖ్యత పెరుగుతుంది. అందుకే మేకర్స్ ఎలాంటి రాజీ లేకుండా పనిచేస్తున్నారని టాక్. తన గత సినిమాలన్నీ వేగంగా పూర్తి చేసే మారుతి (Maruthi Dasari), ఈసారి ప్రభాస్ ప్రాజెక్ట్ కావడంతో అనుకున్న టైమ్‌లో సినిమా కంప్లీట్ చేయలేకపోతున్నాడట. ప్రభాస్ కెరీర్‌లో హారర్ కామెడీ జానర్ లో ఇదే ఫస్ట్ మూవీ కావడం, భారీ వీఎఫ్ఎక్స్ పనులు ఉండటంతో మారుతి కూడా క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 10 ప్లాన్ కుదరక, జూలై 18 కొత్త డేట్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇది కూడా ఫిక్స్ కాదు. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనిని త్వరగా కంప్లీట్ చేయాలని టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తున్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ టైమ్ తీసుకునే ప్రక్రియ కావడంతో మరోసారి ఆలస్యం అవుతుందా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గతంలో సలార్ (Salaar) , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) లాంటి చిత్రాల విడుదల కూడా అనేక మార్లు వాయిదా పడిన కారణంగా, ప్రభాస్ అభిమానులు అప్సెట్ అయ్యారు.
ఇక ఈసారి ఆ డేట్ ఎప్పటికి ఫిక్స్ అవుతుందో చూడాలి. ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా రిలీజ్ కావడం వల్ల, విడుదలకు ముందే భారీ హైప్ ఉంటుంది. అదే సమయంలో, సినిమా నాణ్యతలో ఏమాత్రం తగ్గకుండా చూసే బాధ్యత కూడా మేకర్స్ పై ఉంది. అందుకే, మేకర్స్ విడుదల తేదీ విషయంలో తొందరపడకుండా, పూర్తిగా గ్రాఫిక్స్ పనులు కంప్లీట్ అయిన తర్వాతే డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.