ఆచార్య సినిమాతో కొరటాల శివ ఖాతాలో తొలి ఫ్లాప్ చేరిందనే సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివను నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతి డైరెక్టర్ కు సినీ కెరీర్ లో ఫ్లాప్ కామన్ అయినా కొరటాల శివను కావాలని కొంతమంది టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుండటం గమనార్హం. అయితే ఈ ట్రోలింగ్ కు కొరటాల శివ దర్శకత్వం వహించిన భరత్ అనే నేను ఒక విధంగా కారణమని తెలుస్తోంది.
భరత్ అనే నేను సినిమాకు కొరటాల శివ రెమ్యునరేషన్ కు బదులుగా ఒక ఏరియా హక్కులను తీసుకున్నారు. అయితే కొరటాల శివ హక్కులు తీసుకున్న ఏరియా డిస్ట్రిబ్యూటర్ కు కొంతమేర నష్టాలు వచ్చాయి. అయితే ఆ డబ్బులు నిర్మాత ఇవ్వాలా? లేక హక్కులు తీసుకున్న డైరెక్టర్ ఇవ్వాలా? అనే చర్చ జోరుగా జరిగింది. ఆ తర్వాత ఆచార్య సినిమా హక్కులను మాత్రం కొరటాల శివ ఆ డిస్ట్రిబ్యూటర్ కు కాకుండా మరో డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చారు.
ఆచార్య హక్కుల విషయంలో కొరటాల శివ అడ్డు పడటంతో ఒక డిస్ట్రిబ్యూటర్ కొరటాల శివను టార్గెట్ చేసి ట్రోల్స్ చేయించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఫ్యాన్స్ రాజకీయాల వల్ల కూడా కొంతమేర ఈ సినిమా గురించి నెగిటివ్ గా ట్రోల్స్ వచ్చాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సినిమా కోసం కొరటాల శివ హామీ సంతకాలు కూడా పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యాంటీ ఫ్యాన్స్ ప్రచారం కూడా ఈ సినిమా నష్టాలకు ఒక విధంగా కారణమైందని తెలుస్తోంది.
చిరంజీవి, చరణ్ లపై మాత్రం ఈ సినిమా రిజల్ట్ పెద్దగా ప్రభావం చూపే ఛాన్స్ లేదు. కొరటాల శివపై ఆచార్య ప్రభావం ఉంటుందో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. చిరంజీవి తర్వాత సినిమాలు సక్సెస్ సాధించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.