స్టార్ హీరో నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికే రిలీజవుతుందని చాలారోజుల క్రితమే నాగార్జున వెల్లడించారు. సంక్రాంతి పోటీ నుంచి భీమ్లా నాయక్ తప్పుకోవడంతో సంక్రాంతి బరిలో బంగార్రాజు ఎంట్రీ ఫిక్స్ అయింది. నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడం లవ్ స్టోరీ తర్వాత చైతన్య హీరోగా నటించి విడుదలవుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ వాయిదా పడినా బంగార్రాజు రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది.
సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్ సినిమాను తప్పించిన వెంటనే బంగార్రాజును సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు డేట్ తో సహా ప్రకటిస్తే పవన్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు నాగార్జున గత సినిమాలు మన్మథుడు2, వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. బంగార్రాజు కూడా అంచనాలను అందుకోకపోతే కెరీర్ పై ప్రభావం పడుతుందని నాగ్ భావిస్తున్నారు. అందువల్లే బంగార్రాజు సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించేలా నాగార్జున జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.
2022 సంవత్సరం జనవరి 15వ తేదీన పరిమిత సంఖ్యలో థియేటర్లలో బంగార్రాజు రిలీజ్ కానుందని సినిమాకు హిట్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్ల సంఖ్య పెరిగేలా చేయాలని నాగ్ భావిస్తున్నారు. జనవరి ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ లో వేగం పెంచాలని నాగ్ అనుకుంటున్నారు. సోగ్గాడే చిన్నినాయన మ్యాజిక్ బంగార్రాజుతో రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్కినేని అభిమానుల ఆశలు బంగార్రాజుతో నెరవేరతాయో లేదో చూడాల్సి ఉంది.
రమ్యకృష్ణ, కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున మార్కెట్ ను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. బంగార్రాజుతో నాగ్ ఆశలు నెరవేరతాయో లేదో చూడాల్సి ఉంది.