సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఇక లేరనే వార్త యావత్ తెలుగు సినీ పరిశ్రమని విషాదంలోకి నెట్టేసిందనే చెప్పాలి. ఆయన అభిమానులు.. ఇండస్ట్రీ జనాలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకున్నారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయన ఈరోజు సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగు సినీ పరిశ్రమకి ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు. ఎవరికైనా కొన్ని గొప్ప విషయాలు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఆయన తీసుకుంటారు.కానీ ఆయన సాహిత్యమందించిన పాట మాత్రం ప్రతీ ఒక్కరిలో చైతన్యం నింపుతుంటుంది…. అలాగే ఆలోచింపచేసేలా చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
బహుశా ఆయనకి బంధువు అవ్వడం వల్లనే అనుకుంట.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాల్లో కూడా అవే భావాలు కనిపిస్తాయి. ఇదిలా ఉండగా.. అసలు త్రివిక్రమ్ కు సిరివెన్నెల గారికి మధ్య ఉన్న బంధుత్వం ఏంటి అన్న విషయం బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. వీరిద్దరూ కూడా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారే. ఇండస్ట్రీలో మొదటి నుండీ త్రివిక్రమ్ ను ప్రతిభను, మంచితనాన్ని గమనిస్తూ వచ్చిన సిరివెన్నెల గారు.. తన సోదరుడి(తమ్ముడి) కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. సిరివెన్నెల గారి ఇంట్లోనే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు.
అయితే సిరివెన్నెల గారు తన తమ్ముడి పెద్ద కూతుర్ని త్రివిక్రమ్ కు ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత త్రివిక్రమ్ ‘రోజా’ సినిమా స్టైల్లో చిన్నమ్మాయి నచ్చింది అని సిరివెన్నెల గారికి చెప్పాడట. ఈ విషయమై సిరివెన్నెల సోదరుడు కోప్పడ్డారట. కానీ త్రివిక్రమ్ పద్ధతి, ముక్కు సూటితనం నచ్చి ఎలాగైనా అల్లుడిని చేసుకోవాలనే ఉద్దేశంతో సిరివెన్నెల గారు తన సోదరుడికి నచ్చచెప్పి ఒప్పించారట. అలా సిరివెన్నెల తమ్ముడి చిన్న కూతురు సౌజన్యను వివాహం చేసుకున్నారు త్రివిక్రమ్. ఇలా సిరివెన్నెల, త్రివిక్రమ్ ల మధ్య మామ అల్లుళ్ళ బంధుత్వం ఉందన్న మాట.