రీల్ లైఫ్ లో భారీ యాక్షన్ సీన్స్ చేరే చిరంజీవి.. రియల్ లైఫ్ లో మృదు స్వభావి. ప్రతి ఒక్కరినీ అభిమానిస్తుంటారు. సులువుగా నమ్మేస్తుంటారు. ఈ నమ్మకమే అతన్ని మోసం చేయడానికి ఊతం ఇచ్చింది. ఇంట్లో చోరీ చేయడానికి ప్రోత్సహిచింది. ఇటీవల చిరంజీవి ఇంట్లో 2 లక్షలు పోయాయి. దానిపై చిరంజీవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు కొట్టేసి పరారీలో ఉన్న చెన్నయ్యను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా అసలు విషయం తెలిసింది. చిరంజీవి మేనేజర్ గంగాధర్ రావు ఆఫీసు ఖర్చుల నిమిత్తం 4 లక్షలను తెచ్చి ఇంట్లో పెట్టగా, అందులో నుండి 2 లక్షలను దొంగిలించినట్లు ఇంట్లో పనివాడుగా ఉన్న చెన్నయ్య చెప్పాడు.
ఆ డబ్బులో 50 వేలను జల్సాలకు ఖర్చు పెట్టగా, మిగిలి ఉన్న లక్షన్నరను పోలీసులు రికవరీ చేశారు. అయితే ఈ రెండు లక్షలే కాకుండా చిరంజీవి ఇంట్లో గత 10 సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా ఉంటూ అవకాశం వచ్చినప్పుడల్లా దొగతనం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు సుమారు 15 లక్షల వరకు చెన్నయ్య.. చిరు ఇంట్లో నుంచి అపహరించినట్లు సమాచారం. ఆ డబ్బుతో స్థలాలు కొన్నట్టు తెలిసింది. వీటి ఆధారాలు బయటపడిన తర్వాత.. ఆ వివరాలను పోలీసులు అధికారికంగా మీడియాకి స్పష్టం చేస్తారు.