ప్రతి స్టార్ హీరో తమ జీవితంలో ఏదైనా ఒక సందర్భంలో పౌరాణిక పాత్రలో నటించాలని ఆశ పడతాడు. పౌరాణిక పాత్రలు ఆయా నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు తమ కెరీర్ లో ఆ సినిమాలు ప్రత్యేక సినిమాలుగా నిలుస్తాయనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు శ్రీరాముని పాత్రలో నటించి ఆ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి విజయాలను అందుకున్నారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముని పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రభాస్ కోరుకునే భారీ విజయాన్ని అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తొలిసారి తెలుగు సినిమాల్లో రాముని పాత్రలో యడవల్లి సూర్యనారాయణ నటించారు. పాదుకా పట్టాభిషేకం అనే సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించడం జరిగింది. ఆ తర్వాత ఇదే టైటిల్ తో 1945లో మరో సినిమా రిలీజ్ కాగా ఆ సినిమాలో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాముని పాత్రలో నటించడం గమనార్హం.
ఏఎన్నార్ శ్రీ సీతారామ జననం సినిమాలో రాముని రోల్ లో నటించి మెప్పించారు. రాముని పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. లవకుశ, రామదాసు, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ రామాంజనేయ యుద్ధం సినిమాలలో ఎన్టీఆర్ రాముని పాత్రలో నటించారు. సీతారామ కళ్యాణం, శ్రీరామకథ సినిమాలలో హరనాథ్ రాముడి పాత్రలో నటించి మెప్పించారు.
సంపూర్ణ రామాయణం సినిమాలో శోభన్ బాబు రాముని రోల్ లో నటించారు. వీరాంజనేయ మూవీలో కాంతారావు రాముని పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. బాల రామాయణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, దేవుళ్లు మూవీలో శ్రీకాంత్, శ్రీరామదాసు లో సుమన్, శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య రాముని పాత్రలో నటించి మెప్పించారు.