కొన్నేళ్ల క్రితం విడుదలైన సినిమాను ఏదో స్పెషల్ డేట్ పట్టుకునో లేక ఇంకేదైనా డేట్ అనుకుని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య రీరిలీజ్ సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చేస్తున్నారు. దీంతో రీరిలీజ్ ట్రెండ్ పీక్స్‌లోకి చేరింది అని అంటున్నారు. అయితే ఓ సినిమాకు ఒకటి కాదు, రెండు కాదు, పది కాదు.. వంద కాదు.. ఏకంగా 550 సార్లు రీరిలీజ్ అయ్యిందని తెలుసా? అదెక్కడి సినిమానో కాదు.. మన దేశంలోనిదే, ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాదే.
పైన మేం చెప్పిన సినిమా కన్నడ నాట నుండి వచ్చింది. ఉపేంద్ర దర్శకత్వంలో శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ‘ఓం’ సినిమానే 550 సార్లు రీరిలీజ్ అయ్యింది. ప్రేమ కథానాయికగా నటించిన ఈ సినిమా 28 ఏళ్ల క్రితం వచ్చింది. అంటే మే 19, 1995న ఈ సినిమాను తొలిసారి రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా కన్నడనాట సంచలనం సృష్టించింది అని చెప్పాలి. అప్పటి నుండి మార్చి 12, 2015 వరకు 550 సార్లు రీ రిలీజ్ చేశారు.
అంతేకాదు అత్యధికసార్లు రీరిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించింది. ఈ సినిమా అప్పట్లో చాలాసార్లు మాట్లాడుకున్నా ఇప్పుడు మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ సినిమా విషయంల ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి. ఉపేంద్ర కాలేజ్ చదువుకునే రోజుల్లోనే ఈ కథ రాసుకున్నారట. కాలేజ్‌లో జరిగిన ఓ ఘటనను స్ఫూర్తిగా తీసుకుని ‘ఓం’ కథ ఫస్ట్ హాఫ్ రాసుకున్నారట.
‘ఓం’ సినిమా బడ్జెట్ సుమారు రూ.70లక్షలు. బెంగళూరులోని కపిల్ థియేటర్‌లో ‘ఓం’ సినిమాను అత్యధికంగా 30 సార్లు రీ-రిలీజ్ చేశారు. అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులు, నిందితులు ‘ఓం’ సినిమాలో నటించారట. ఈ సినిమా కోసమే కొందరిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చారట. రౌడీషీట్‌లు ఉన్నవారిని కూడా సినిమాలో నటింపజేశారట. తొలుత తీసిన క్లైమాక్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందట. దీంతో అవసరమైన మార్పులు చేశారట.