Ticket Hike: సమ్మర్ సినిమాల రేట్ల పెంపు ఇక కష్టమేనా?
- January 22, 2026 / 05:49 PM ISTByFilmy Focus Writer
టాలీవుడ్ నిర్మాతలకు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన లేటెస్ట్ గైడ్‌లైన్స్ నిద్రలేకుండా చేస్తున్నాయి. సినిమా టికెట్ ధరలు పెంచుకోవాలంటే కనీసం మూడు నెలల ముందే అప్లై చేసుకోవాలన్న నిబంధన, రాబోయే భారీ చిత్రాల ప్లానింగ్‌ను తలకిందులు చేసేలా ఉంది. పక్కాగా రిలీజ్ డేట్ ఖరారు కాకుండానే ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పెద్ద టాస్క్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Ticket Hike
ముఖ్యంగా ఈ వేసవికి రిలీజ్ లైన్ అప్‌లో ఉన్న బిగ్ మూవీస్ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు సమ్మర్ బరిలో ఉన్నట్లు టాక్. వీటితో పాటు నాని ‘ది ప్యారడైజ్’, నిఖిల్ ‘స్వయంభూ’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా రేసులో ఉన్నాయి. షూటింగ్ అప్‌డేట్స్, వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఈ సినిమాల రిలీజ్ డేట్స్ తరచూ మారుతుంటాయి. మరి ఇలాంటి టైమ్‌లో 90 రోజుల ముందే రేట్ల పెంపుపై క్లారిటీ ఎలా వస్తుందనేది అసలు సమస్య.
సాధారణంగా ఒక సినిమా రిలీజ్ కి నెల రోజుల ముందు మాత్రమే అసలైన బజ్ మొదలవుతుంది. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం, మే నెలలో వచ్చే సినిమాలు ఫిబ్రవరిలోనే తమ దరఖాస్తులు పూర్తి చేయాలి. అడవి శేష్ ‘డెకాయిట్’, నాగ చైతన్య ‘వృష కర్మ’, వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ వంటి సినిమాలు కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. రిలీజ్ డేట్లలో చిన్న మార్పు జరిగినా, పాత అనుమతులు చెల్లుతాయా లేదా అన్నది కూడా ఇప్పుడు టెన్షన్ పెడుతున్న పాయింట్.
మరోవైపు ఏపీలో టికెట్ రేట్ల పెంపు ప్రక్రియ సాఫీగా సాగుతుండగా, కేవలం తెలంగాణలోనే ఈ 90 రోజుల డెడ్‌లైన్ ఉండటం నిర్మాతలకు ఆర్థికంగా భారమయ్యేలా కనిపిస్తోంది. పెద్ద సినిమాలకు మొదటి వారం వచ్చే కలెక్షన్లే కీలకం కాబట్టి, హైక్ లేకపోతే బయ్యర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అఖిల్ ‘లెనిన్’, శర్వానంద్ ‘బైకర్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ వంటి సినిమాల మేకర్స్ కూడా ఇప్పుడు కోర్టు ఆదేశాల నేపథ్యంలో అలెర్ట్ అవుతున్నారు.
ఈ పరిస్థితిని చూస్తుంటే సమ్మర్ బరిలో నిలవాల్సిన కొన్ని సినిమాలు తమ డేట్లను అడ్జస్ట్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వ అనుమతులు సకాలంలో రాకపోతే, టికెట్ ధరల పెంపు కోసం రిలీజ్‌ను వాయిదా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి హైకోర్టు నిబంధనపై ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇస్తుందా లేక నిర్మాతలు ఈ కొత్త రూల్‌కు తగ్గట్టుగా తమ ప్లాన్స్ మార్చుకుంటారా అనేది చూడాలి.















