గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు.. ఈ సామెత మీరు వినే ఉంటారు. దీనిని సినిమాలకు ఆపాదిస్తే మంచి సినిమాలు నాలుగైదు వచ్చినా ఫర్వాలేదు.. ఉపయోగం లేని సినిమాలు వందలు చేసి ఏం లాభం. ఈ మాట మేం అనడం లేదు. ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత చెప్పిన మాటలను మరో రూపంలో చెప్పామంతే. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనే చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతోంది.
Naga Vamsi
దీనికి కారణం ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో తెలుగు యువ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) మాటలు. పక్కన సీనియర్ నిర్మాత బోనీ కపూర్‌ను కూర్చోబెట్టుకుని ఆయన బాలీవుడ్ గురించి విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో బాలీవుడ్‌ను తీవ్రంగా విమర్శించారు. అందులో తప్పేమీ లేదు, ఆయన లేనిపోని విషయాలూ చెప్పలేదు. అయితే, ఇక్కడో విషయం ఏంటంట మన ఇల్లు చక్కబెట్టుకున్నాక పక్క ఇంటి గురించి మాట్లాడాలి అనే విషయాన్ని ఆయన మరచిపోయారు అనే మాట కూడా వినిపిస్తుండటమే.
తెలుగు సినిమాను వైపు ఇప్పుడు ప్రపంచం చూస్తోందని, ఈ విషయంలో బాలీవుడ్ వెనుకబడింది అని నాగవంశీ ఓ విశ్లేషణలా చెప్పారు. అయితే ఆయన చెప్పినట్లు టాలీవుడ్ వెలుగుతున్నా.. ఇంకా చీకట్లు మిగులుస్తున్న సినిమాలు ఉన్నాయి అనేది తెలుగు ప్రేక్షకుల సూచన. తెలుగు సినిమాలు వందల కొద్దీ వస్తుంటే.. భారీ విజయాలు పదుల సంఖ్యలో కూడా రావడం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే.
అందుకే ఒకటో, రెండో విజయాలతో టాలీవుడ్ అగ్ర స్థానానికి చేరింది అని అనుకోవడం సరికాదు. విజయాల సంఖ్యను భారీగా పెంచుకుని టాలీవుడ్ ఇంకా ఎదిగాక అప్పుడు ఇలా అంటే బాగుంటుంది అనేది తెలుగు ప్రేక్షకుల సూచన. మరి ఈ విషయంలో నాగవంశీ ఏమంటారో చూడాలి. బాలీవుడ్ జనాల విమర్శలు మనకు ఇప్పుడు నొప్పి పెట్టిస్తూ ఉండొచ్చు. అందులో కూడా మనకు మంచి చేసే వ్యాఖ్యలు తీసుకోవాలి అంటే పై వ్యాఖ్యలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.