తెలుగు సినిమాలో అనేక పాత్రలు పోషించిన మహానటుడు నందమూరి తారక రామారావుని ముఖ్యమంత్రిగా గెలిపించిన ఘనత తెలుగు ప్రజలది. అందుకే సినిమా రంగానికి రాజకీయరంగానికి దగ్గర అనుబంధం ఉంటుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఆసక్తికరంగా ఉంటాయి. అదే మనహీరోలు ముఖ్యమంత్రిగా నటిస్తే అభిమానులు మురిసిపోతారు. అలాంటి ముఖ్యమంత్రి మనకి నిజజీవితంలోనూ ఉండాలని కోరుకున్నారు. అలా వెండితెరపై సీఎం గా మెప్పించిన స్టార్ హీరోలపై ఫోకస్..
కృష్ణ (ముఖ్యమంత్రి)
సాహసాల వీరుడు, సూపర్ స్టార్ కృష్ణ ముఖ్యమంత్రి అనే సినిమా చేసారు. ఇందులో సీఎం గా అదరగొట్టారు. ముఖ్యమంత్రి ఉంటే ఇలా ఉండాలనిపించారు.
మహేష్ బాబు (భరత్ అనే నేను)
నటనలో, వ్యక్తిత్వంలో తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు అనేక సార్లు నిరూపించుకున్నారు. ఇప్పుడు మరోసారి కృష్ణ వారసుడని అనిపించుకున్నారు. భరత్ అనే నేను సినిమాలో పవర్ ఫుల్ సీఎం గా ఆకట్టుకున్నారు.
ఏఎన్నార్ (రాజకీయ చదరంగం)
సాంఘిక చిత్రాల హీరో అక్కినేని నాగేశ్వరరావు పోషించని రోల్ అంటూ లేదు. అలాగే రాజకీయ చదరంగం అనే చిత్రంలో ముఖ్యమంత్రిగా ఏఎన్నార్ అందరితో అభినందనలు అందుకున్నారు. ఏ పాత్రలోనైనా జీవించేస్తారని నిరూపించుకున్నారు.
అర్జున్ (ఒకే ఒక్కడు)
కమర్షియల్ డైరక్టర్ శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించారు. సీఎం అయిన వ్యక్తి ఒక్కరోజులో ఎన్నిపనులు చేయగలరో.. ఎంత మార్పు తీసుకురాగలరో చూపించారు.
రానా దగ్గుబాటి (లీడర్)
వెండితెరపై ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎవరైనా లవర్ బాయ్ గానో.. యాక్షన్ హీరోగానో ఎంటర్ అవుతారు. అటువంటిది రానా దగ్గుబాటి మాత్రం లీడర్ సినిమా ద్వారా ముఖ్యమంత్రిగా పరిచయమయ్యారు. నవతరం సీఎం గా మంచి మార్కులు కొట్టేశారు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలోనూ రాజకీయనాయకుడిగా భలే చేశారు.
జగపతి బాబు (అధినేత)
ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు ఒక నేత ఎలా ఉండాలో అని అధినేత చిత్రంలో చక్కగా నటించి చూపించారు. ముఖ్యమంత్రిగా మెప్పించారు.
ఒక్కఓటు
గొప్ప నటుడు పార్తీబన్ ఒక్కఓటు సినిమాలో ముఖ్యమంత్రిగా ఆకట్టుకున్నారు. కొంత సేపు సీఎం గా కనిపించినప్పటికీ తనదైన శైలిలో అలరించారు.
ఇక మహా నేతలుగా, పేదల నేతగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, వైఎస్సార్ జీవితాలపై బయోపిక్ లు త్వరలో రానున్నాయి. ఇందులో నిజజీవితంలో ముఖ్యమంత్రులను వెండితెరపై చూడనున్నాం.