తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మద్దతు అంటే తెలంగాణ ప్రభుత్వం నుండే అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏవేవో రూల్స్ పెట్టారు. అయితే కొంతమందికే అనుకోండి. అయితే ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి గత ప్రభుత్వంలానే ఇప్పుడు కూడా మద్దతు ఉంటుందా అనే డౌట్ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాం అని నిర్మాతలు ఇటీవల చెప్పారు.
ఇప్పుడు, నిర్మాతలతో సీఎం భేటీకి రంగం సిద్ధమైంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ నెల 21న ముఖ్యమంత్రిని తెలుగు సినిమా పెద్దలు కలుస్తారు అని సమాచారం. సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య నిర్మాత ‘దిల్’ రాజు వారధిగా ఈ భేటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టాలీవుడ్ పెద్దలు కలిసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెల 21న కలవడానికి అపాయింట్‌మెంట్ వచ్చిందని చెబుతున్నారు. ఈ భేటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉంటారని టాక్. ఈ మీటింగ్‌లో తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు చిత్రసీమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి టాలీవుడ్ పెద్దలు తమ ఆలోచనలు వివరిస్తారని టాక్. సీఎంను కలిసేవారిలో దిల్ రాజు, కె. రాఘవేంద్రరావు, సురేష్ బాబు, సి. కళ్యాణ్, కెఎల్ దామోదర ప్రసాద్, టి. ప్రసన్న కుమార్, ముత్యాల రాందాసు ఉంటారని చెబుతున్నారు.
ఇక గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో ఫ్రెండ్లీగానే వ్యవహరించింది. ఏపీ ప్రభుత్వంతో పోలిస్తే టికెట్ ధరల పెంపు అదనపు షోల విషయంలో చాలా వెసులుబాట్లు కల్పించింది. సినిమా వేడుకలకు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చారు కూడా. మరి ఆ తరహాలో తెలంగాణ కొత్త ప్రభుత్వం నుండి ఎవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సీఎంతో (Revanth Reddy) భేటీ తర్వాత ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.