₹100 కోట్లు, అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రాలకు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నారు. అయితే ఇక్కడో షరతు కూడా ఉంది. ఆంధ్రలో 20 శాతం సినిమా చిత్రీకరణ జరుపుకున్న వాటికే ఈ టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుంది. ఈ విషయం మీకు గుర్తుంది కదా. మొన్నీమధ్యే టికెట్ రేట్ల పెంపు జీవో ఇస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. దీంతో తెలుగు సినిమా ప్రొడక్షన్ హౌస్‌ల ఆలోచన మారిపోయింది.
సినిమా ప్రారంభించడం ఆలస్యం… ఏపీలో సినిమా షూట్ చేయాల్సిందే అనుకుంటున్నారట. తెలుగు సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేయడం కొత్తనా అంటే.. కాదనే చెప్పాలి. గతంలో చాలా సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. ఏపీలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో చిత్రీకరణలు చేశారు. అయితే ఇటీవల కాలంలో తగ్గిపోయింది అని అంటుంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ పెట్టిన లాజిక్‌కి మళ్లీ నిర్మాతలు ఆ దిశగా ఆలోచిస్తున్నారట. సినిమాల టికెట్ ధరల విషయంలో అక్కడి ప్రభుత్వం నుండి అనుమతులు కావాలంటే 20 శాతం చిత్రీకరణ జరగాలి.
దీంతో అక్కడ ఏ సీన్స్ తీయొచ్చు అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలు, కుర్ర స్టార్ల సినిమాలు అక్కడ చిత్రీకరణలకు క్యూ కడుతున్నాయి. మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంతంలో ప్రభాస్ – నాగ్ అశ్విన్‌ల ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ జరిగింది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. ప్రభాస్ అయితే షూట్‌లో లేడు కానీ.. చిత్రంలోని కీలక పాత్రధారులు ఉన్నారట.
ఇప్పుడు అఖిల్ ‘ఏజెంట్’ కూడా విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారని సమాచారం. కొన్ని రోజుల క్రితం రామ్‌చరణ్ – శంకర్ సినిమా షూటింగ్ రాజమహేంద్రవరంలో జరిగింది. అయితే ఆ షూట్ ప్లాన్ చేసుకునేటప్పటికి జీవో రాలేదు. అయితే ముందుగానే చేసుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యింది. వీళ్లే కాదు, మిగిలిన స్టార్ హీరోలు కూడా ఏపీలో షూటింగ్‌లకు రెడీ అవుతున్నారని టాక్.