2019లో మరణించిన తారలు?

నూతన సంవత్సరం వస్తుంది పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళిపోతున్న పాత సంవత్సరం.. మనకి అన్నీ హ్యాపీ మూమెంట్స్ నే ఇచ్చి వెళ్తుందా అంటే కచ్చితంగా చెప్పలేం. అందుకే కొత్త సంవత్సరంలో ఎటువంటి చేదు సంఘటనలు చోటు చేసుకోకూడదు అని ముందు నుండీ బలంగా కోరుకోవాలి. ఇదిలా ఉంటే.. మరికొద్ది రోజుల్లో 2019 సంవత్సరానికి గుడ్ బై చెప్పేస్తాం. ఈ ఏడాది మన సినీ ఇండస్ట్రీలో కొందరి ప్రముఖులు హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. మరి వారెవరెవరో… మరోసారి వారిని గుర్తుచేసుకుందాం రండి :

1) మహేష్ ఆనంద్ : ఈ ప్రముఖ బాలీవుడ్ నటుడు మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. ‘నెంబర్ 1’, ‘ఎస్.పి.పరశురామ్’ ‘టాప్ హీరో’ ‘అల్లుడా మజాకా’ ‘ఘరానా బుల్లోడు’ వంటి చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా ‘నెంబర్ 1’ సినిమాలో సైకో విలన్ గా నటించి.. కమెడియన్ బ్రహ్మనందం ను ఓ ఆట ఆడుకునే సీన్లకి ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. ఇక ఈయన అనుకోకుండా 2019 ఫిబ్రవరి 8న మరణించాడు. ఈయన వయసు అప్పటికి కేవలం 57 సంవత్సరాలు మాత్రమే.

2) విజయ్ బాపినీడు : మెగాస్టార్ చిరంజీవితో ‘మగమహారాజు’ ‘మహానగరంలో మాయగాడు’ ‘హీరో’ ‘గ్యాంగ్ లీడర్’ ‘బిగ్ బాస్’ వంటి చిత్రాలు తెరకెక్కించిన విజయ్ బాపినీడు కూడా.. 2019 ఫిబ్రవరి 11న కన్నుమూశారు. అప్పటికే కొన్నాళ్ళ నుండీ అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన.. పరిస్థితి విషమించడంతో మరణించినట్టు వైద్యులు తెలిపారు.

3) శ్రీనివాస దీక్షితులు : ‘మురారి’ చిత్రం ద్వారా పాపులర్ అయిన శ్రీనివాస దీక్షితులు ఆ తరువాత ‘అతడు’ ‘అన్నవరం’ ‘దృశ్యం’ వంటి చిత్రాల్లో నటించారు. ఈయన కూడా 2019 ఫిబ్రవరి లోనే మరణించారు.

4) కోడి రామకృష్ణ : టాలీవుడ్ కు గ్రాఫిక్స్ అంటే పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తన తోటి దర్శకులు అంతా దుకాణం సర్దేసినప్పటికీ.. కోడి రామకృష్ణ మాత్రం ‘అరుంధతి’ చిత్రంతో సరికొత్త రికార్డులు సృష్టించారు. అలాంటి గొప్ప దర్శకుడు కూడా 2019 ఫిబ్రవరిలోనే మరణించారు.

5) రాళ్ళపల్లి నరసింహారావు : కొన్ని వందల చిత్రాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాళ్ళపల్లి. ‘ఖైదీ’ ‘అభిలాష’ ‘కలిసుందాం రా’ ‘సంక్రాంతి’ వంటి చిత్రాల్లో ఆయన నటన ఎవ్వరూ మరిచిపోలేరు. ఇక ఈయన కూడా 2019 లోనే మే నెలలో మరణించారు.

6) విజయ నిర్మల : హీరోయిన్ గానే కాకుండా.. డైరెక్టర్ గా కూడా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలని డైరెక్ట్ చేసి గిన్నీస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది.. సూపర్ స్టార్ కృష్ణగారి రెండో భార్య విజయ నిర్మలగారు. అనూహ్యంగా ఈవిడ కూడా 2019లోనే మరణించారు.

7) శ్రీకాంత్ వర్మ : ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తండ్రి శ్రీకాంత్ వర్మ కూడా 2019లోనే మరణించారు. ఈయన ఎన్నో పుస్తకాలను రచించారు.. అంతేకాదు తన కొడుకు ఇంద్రగంటి తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో పాటలను కూడా రాసారు.

8) దేవదాస్ కనకాల : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తండ్రి.. అలాగే స్టార్ యాంకర్ సుమ మామగారు అయిన దేవదాస్ కనకాల కూడా 2019లోనే మరణించారు. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన ఈయన ‘అమృతం’ సీరియల్ ద్వారా తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు.

9) వేణుమాధవ్ : టాలీవుడ్ టాప్ కమెడియన్ వేణుమాధవ్ కూడా 2019 లోనే మరణించారు. గత కొన్నేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన సెప్టెంబర్ నెలలో మరణించారు. ఈయన వయసు అప్పటికి కేవలం 49 ఏళ్ళే..!

10) గీతాంజలి : తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది గీతాంజలి. ఈమె కూడా 2019 అక్టోబర్లో మరణించారు.

11) గొల్లపూడి మారుతీరావు : రచయిత గాను అలాగే నటుడుగానూ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన గొల్లపూడి మారుతీరావు గారు కొద్దిరోజుల క్రితమే మరణించారు. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లోని నటించిన ఈయన ఆకారిగా ఆది హీరోగా వచ్చిన ‘జోడి’ చిత్రంలో నటించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus