మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు అంచనాలను మించి కలెక్షన్లు వచ్చాయి. 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. తను క్రియేట్ చేసిన రికార్డులను జక్కన్న బ్రేక్ చేయగలరా? లేదా? అనే చర్చ జోరుగా జరుగుతోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ నిడివి 3 గంటల 2 నిమిషాలు అనే సంగతి తెలిసిందే. సినిమా నిడివి ఎక్కువే అయినా మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా నిడివి విషయంలో ఎలాంటి నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. అయితే ఈ సినిమాలో ఎడిటింగ్ లో చాలా సన్నివేశాలను కట్ చేశారని సమాచారం అందుతోంది. పీటర్ డాపర్ అనే వ్యక్తి ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ వర్క్ కొరకు పని చేశారు. పీటర్ డాపర్ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఆర్ఆర్ మూవీలో తాను మూడు సన్నివేశాలలో కనిపించానని అయితే సినిమాలో ఆ మూడు సన్నివేశాలలో ఒక్క సన్నివేశం కూడా లేదని పీటర్ డాపర్ అన్నారు. ఈ మూడు సీన్లతో పాటు జక్కన్న సినిమా రన్ టైమ్ కు అనుగుణంగా సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలను పక్కన పెట్టారని సమాచారం. ఆ సన్నివేశాలను సినిమాలో కలిపి ఉంటే మాత్రం రన్ టైమ్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే రాజమౌళి సినిమాలో చరణ్ సన్నివేశాలను ఎక్కువగా కట్ చేశారో లేక ఎన్టీఆర్ సన్నివేశాలను ఎక్కువగా కట్ చేశారో తెలియాల్సి ఉంది.
రాజమౌళి బాహుబలి2 సినిమాకు సంబంధించి కూడా చాలా సీన్లను కట్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ మూవీలో కట్ చేసిన సన్నివేశాలను యూట్యూబ్ లో రాబోయే రోజుల్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని లేదా ఆర్ఆర్ఆర్ ఓటీటీ వెర్షన్ లో కొత్త సీన్లను కలిపితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కళ్లు చెదిరే రికార్డులు సాధిస్తుండటంతో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు సంతోషిస్తున్నారు.