బ్రహ్మానందం… ఈ మాట వినగానే నవ్వులు ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. అయితే ఇది సినిమా చూస్తున్న జనాలకు. మరి సినిమా షూటింగ్‌లో పరిస్థితి ఏంటి, సినిమాలు తీసే దర్శకుల పరిస్థితి ఏంటి. వాళ్ల పరిస్థితీ ఇంచుమించు ఇంతే. బ్రహ్మానందంతో ఎంతోమంది దర్శకులు పని చేసి ఉండొచ్చు. అయితే రీసెంట్ టైమ్స్‌లో బ్రహ్మీతో అదిరిపోయే సీన్స్‌తో తీసింది, రాసిన వాళ్లలో త్రివిక్రమ్ ఒకరు. ఆయన శైలి రైటింగ్‌లో బ్రహ్మీ టైమింగ్ అదిరిపోతుంది. అలాంటి త్రివిక్రమ్‌ను బ్రహ్మీ గురించి మాట్లాడమంటే.. ఇదిగో ఇలా ఉంటుంది.
ఉగాదిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ (FNCC) సభ్యులు బ్రహ్మానందాన్ని ఇటీవల సత్కరించారు. FNCC స్థాపించి 30 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో బ్రహ్మానందం గురించి త్రివిక్రమ్ (Trivikram) గొప్పగా మాట్లాడారు. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా బ్రహ్మానందంతో(Brahmanandam) వ్యక్తిగతంగా గడిపే సమయం దొరకడం నా అదృష్టం అన్న త్రివిక్రమ్.. ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు, ఆయన కూడా ఎప్పుడూ నవ్వుతూ బతుకుతుంటారు అని చెప్పారు.
‘‘మనం ఏదైనా చెబితే బ్రహ్మానందం విననట్టే ఉంటారు. కానీ మనం ఆ సీన్ చెప్పిన మరుక్షణం నుంచి ఆయన ఆ పాత్రలో పరకాయప్రవేశం చేసేసి ఉంటారు. ఆ సీన్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్‌ను తనలోని నటుడి దగ్గరకు లాక్కుంటారు’’ అంటూ ఆయన గొప్పతనం గురించి వివరించారు త్రివిక్రమ్(Trivikram) . అంతేకాదు మనకు భౌతికంగా కనిపించే బ్రహ్మానందం వేరు, మానసికంగా బ్రహ్మానందం వేరు. ఆయన చాలా లోతైన వ్యక్తి. ఎంతో విజ్ఞానం ఉన్న వ్యక్తి అంటూ కొనియాడారు.
‘‘మానసికంగా బ్రహ్మానందం ఎన్నో మెట్లు దిగి కమెడియన్ పాత్రను పోషిస్తున్నారు. ఆధ్యాత్మికత, వాస్తవికతల మధ్యలో ఉండే సంఘర్షణలో బతికే మేధావి బ్రహ్మానందం’’ (Brahmanandam) అని చెప్పొచ్చు అన్నారు త్రివిక్రమ్ (Trivikram). ఇటీవల విడుదలైన ‘రంగమార్తాండ’ సినిమాలో ఆయన పాత్ర.. నిజ జీవితం అని చెప్పొచ్చు. మనందరి నవ్వులు ఒక్క సంవత్సరం కింద లెక్కేస్తే… అవి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతాయి. ఆయన ఆ అన్ని సంవత్సరాలూ జీవించాలని, అందరినీ నవ్విస్తూనే ఉండాలని కోరుకుంటున్నా అంటూ తనదైన శైలిలో మాట్లాడారు త్రివిక్రమ్.