నీలికళ్ల సుందరి ఇంద్రజ యమలీల చిత్రంలో హీరోయిన్ గా నటించి అదరగొట్టింది. జీను ప్యాంట్ బుల్లెమ్మగా పాపులర్ అయింది. అలాగే సొగసు చూడతరమా, అమ్మదొంగా, పెద్దన్నయ్య సినిమాలతో స్టార్ హీరోయిన్ అయింది. అలా మూడు భాషల్లో 80 సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. దిక్కులు చూడకు రామయ్య సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా మంచి ఆఫర్లు అందుకుంటోంది. ‘శతమానంభవతి’ లోను మంచి మార్కులు పట్టేసింది. అటువంటి నటి అజ్ఞాతవాసిలో చిన్న రోల్ చేసింది. ఎందుకు ప్రాముఖ్యత లేని రోల్ చేయడానికి ఒప్పుకున్నారని ఆమెను అడగగా ఇలా సమాధానం చెప్పింది.
” అజ్ఞాతవాసిలో నాది చిన్న పాత్ర. అయినా ఒప్పుకోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి పవన్‌కల్యాణ్. మరొకటి త్రివిక్రమ్‌గారు. అందరూ మెచ్చుకునే టెక్నీషియన్ ఆయన. పవన్‌గారితో కాంబినేషన్ లేదని నాకు కథ చెప్పినప్పుడే తెలుసు. త్రివిక్రమ్‌గారి దర్శకత్వం నాకు ఇష్టం. ‘ఖలేజా’ నాకు చాలా నచ్చిన సినిమా. అది ఆడింది.. ఆడలేదు అన్న విషయాలను పక్కన పెడితే నాకు ఇష్టమైన ఫిల్మ్ అది. ఆయన చిత్రంలో నటించడం ఒక ఎత్తయితే, విరామ సమయంలో ఆయన పక్కన కూర్చుని మాట్లాడటం ఒక అద్భుతమైన అనుభూతి.” అని ఇంద్రజ చెప్పింది. నిహారిక సినిమా హ్యాపీ వెడ్డింగ్ లో ఇంద్రజ కీలకరోల్ పోషించింది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.