‘పోకిరి’, ‘దూకుడు’ వంటి సినిమాల్లా కలెక్షన్ల వర్షం కురిపించకపోయినా మహేశ్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు ‘అతడు’, ‘ఖలేజా’. అప్పటివరకు లవర్ బాయ్ గా మురిపించిన ‘మహేశ్’ లోని సీరియస్ యాంగిల్ బయటపెట్టిన సినిమా ‘అతడు’. బతకాడానికి మనుషులను చంపే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ని బంధాలకు విలువిచ్చే కుటుంబంతో త్రివిక్రమ్ ముడిపెట్టిన వైనం ప్రేక్షకలోకాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. అక్కడికి అయిదేళ్ల తర్వాత వచ్చిన ‘ఖలేజా’లో మహేశ్ లోని కామెడీ టైమింగ్ ని పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమాకి కొందరు ‘టీవీ’ సినిమా అని కూడా అన్నారు. తర్వాత దీనిపై మాటల మాంత్రికుడు కాస్త తీవ్రంగా స్పందించారు కూడా. ఈ సంగతిలా ఉంటే ‘అతడు’ లోని సీరియస్ యాంగిల్ మహేశ్ ని ‘పోకిరి’గా మారిస్తే, ‘ఖలేజా’ అతడిలోని ‘దూకుడు’ని చూపించింది.
జయాపజయాలను పక్కనపెడితే మహేశ్-త్రివిక్రమ్ మధ్య ఈ రెండు సినిమాలతో మంచి బంధం అల్లుకుంది. వీరిద్దరి కలయికలో మరో సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ కూడా ఈసారి తమ ‘ఖలేజా’ని చాటి చెప్పాలని ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక మహేశ్ అయితే త్రివిక్రమ్ ఎప్పుడంటే అప్పుడు రెడీ అని చాలా సార్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో మురుగదాస్ సినిమా తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకి సన్నాహాలు చేస్తున్న త్రివిక్రమ్ మహేశ్ సినిమాకి సంబధించిన కథపైనా దృష్టి సారిస్తున్నారట. అయితే నిర్మాణ విషయంలో ఓ చిక్కొచ్చిందట.
సహ నిర్మాతగా ఉన్న సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)ను ‘జులాయి’ సినిమాతో నిర్మాతగా మార్చేశారు త్రివిక్రమ్. అప్పటినుండి వీరిద్దరూ ఒకే గూటి పక్షుల్లా మెలుగుతూ వస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ అచ్చంగా త్రివిక్రమ్ కోసమే అన్నట్టు చెప్పారు రాధాకృష్ణ. ఆ మాట ప్రకారమే ఈ బ్యానర్ లో ‘S/o సత్యమూర్తి’, ‘అఆ’ సినిమాలు చేసిన త్రివిక్రమ్ పవన్ తో చేయనున్న మూడో సినిమాని అదే బ్యానర్ లో చేయడానికి సిద్ధమయ్యారు. తర్వాత మహేష్ సినిమా మాత్రం వేరే బ్యానర్ లో చేస్తున్నారట. కారణం తనని ‘శ్రీమంతుడు’ని చేసిన మైత్రి మూవీస్ సంస్థ వారికి మహేశ్ డేట్స్ కేటయించడమే. ఈ పరిస్థితుల్లో త్రివిక్రమ్ ఎవరితో ‘మైత్రి’ నడుపుతారన్నది ఆసక్తిగా మారింది.