తెలుగులో స్టార్ యాంకర్ అనే బిరుదును ఎక్కువ కాలం దక్కించుకున్న అతి కొద్దిమంది యాంకర్లలో ఉదయభాను ఒకరు. కొన్నేళ్లపాటు ఆమె స్టార్‌గా వెలుగొందింది. అయితే మధ్యలో వివిధ కారణాల వల్ల ఆమె కామ్ అయిపోయింది. తొలుత ఈవెంట్లు ఆగిపోయాయి, ఆ తర్వాత షోస్ ఆగిపోయాయి. ఇప్పుడు చేస్తున్నా చాలా తక్కువ మొత్తంలోనే ఉంటున్నాయి. ఏమైంది, ఎందుకు ఉదయభాను యాంకర్‌గా కనిపించడం లేదు అనే చర్చ గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఆమెకు అవకాశాలు లేవా? రానివ్వడం లేదా అనే డౌట్స్ కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఉదయభాను ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
‘ఢీ’, ‘జాణవులే నెరజాణవులే’, ‘పిల్లలు పిడుగులు’, ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’, ‘రేలారే రే రేలా’, ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింబకా’.. ఇలా చాలా షోస్ చేసిన ఉదయభాను.. సినిమాల ఈవెంట్ల హోస్టింగ్‌కి ఫస్ట్ ఆప్షన్‌గా ఉండేది. అయితే ఇప్పుడు కాదు. అయితే ఆమె ఇటీవల ‘ఓ భామ అయ్యో రామ’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హోస్ట్‌చేసింది. ఆ స్టేజీ మీదనే ‘మళ్లీ నేను ఎప్పుడు యాంకరింగ్ చేస్తానో తెలియదు. ఇక్కడో పెద్ద సిండికేట్ ఏర్పడిపోయింది’’ అని కామెంట్స్ చేసింది.
ఆ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన ప్రముఖ యువ దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ ఉదయభాను చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తున్నారు అన్నారు. దానికి ఆమె రియాక్ట్ అవుతూ ఇదొక్కటే చేశానండీ.. మళ్లీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు. రేపే ఈవెంట్ అని అనుకుంటాం కానీ.. చేసేరోజుకి ఈవెంట్ ఉండదు. హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఈ ఈవెంట్ చేయగలిగాను అని అంది ఉదయభాను. ఈ మాటల్లో ఆమె అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ఆ తర్వాత రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ ఉదయభాను మైక్ పట్టుకుంటే ‘ఒక నారి వంద తుపాకుల’ టైప్ అని అన్నారు. ఆ మాటలకు ఉదయభాను రియాక్ట్ అవుతూ ‘నాకు చాలా బుల్లెట్లు తగిలాయి.. అది ఎవరికీ తెలియదు’ అని నవ్వేసింది. మరి ఆ సిండికేట్ ఏంటి? అందులో సభ్యులెవరు అనేది ఆమెనే చెబితే బాగుండేది. చూద్దాం ఆమె చాలా స్ట్రయిట్ ఫార్వర్డ్ ఏ ఇంటర్వ్యూలోనో, షోలోనే చెప్పేసే అవకాశం ఉంది.