సూపర్ స్టార్ కృష్ణ.. ఆ తరంలో తెలుగు ఇండస్ట్రీకి ఆయన పరిచయం చేసిన సాంకేతికత, నటుడిగా చేసిన సాహసాలు.. సినిమాలతో సృష్టించిన సంచలనాలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ రికార్డే.. 100వ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ తో సినిమా స్కోప్‌ని పరిచయం చేసిన కృష్ణ.. 200వ సినిమా ‘ఈనాడు’ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు.. కెరీర్ స్టార్ట్ చేసిన 17 సంవత్సరాలలో 200వ సినిమా చేయడం కృష్ణకు మాత్రమే సాధ్యం.. హీరోయిన్, డ్యూయెట్స్ లేకుండానే సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమా సూపర్ స్టార్ నటించిన ‘ఈనాడు’.. 1982 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం 2022 డిసెంబర్ 17 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా కొన్ని ఆసక్తికర విషయాలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం..
100వ సినిమాలానే 200వ చిత్రం కూడా సంచలన విజయం సాధించాలని కృష్ణ.. ‘ఛత్రపతి శివాజీ’ కథతో సినిమా చేయాలని స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తున్నారు కానీ ఎన్ని వెర్షన్స్ రాసినా ఆయనకు నచ్చలేదు.. మరోవైపు సొంత సంస్థ పద్మాలయాలో సినిమా చేయాలన్నా కానీ డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. ఆ సమయంలో కృష్ణ సోదరుడు ఓ మలయాళ సినిమా నచ్చేసి రైట్స్ కొనేశారు. పి. సాంబశివ రావుని దర్శకుడిగా.. శ్రీధర్‌ని హీరోగా అనుకున్నారు..
అయితే సాంబశివ రావు, కృష్ణను కలిసి ఈ సినిమా మీకైతే సరిగ్గా సరిపోతుందని చెప్పారు. అప్పటికే మాస్ హీరోగా కొనసాగుతున్న కృష్ణకు.. కథానాయిక, పాటలు వంటి కమర్షియల్ అంశాలు లేని చిత్రం తను చేస్తే చూస్తారా? అనే సందేహం వచ్చింది.. దీంతో పరుచూరి సోదరులను పిలిచి ఓసారి సినిమా చూడమని చెప్పారు.. చూశాక వాళ్లు కూడా దర్శకుడు చెప్పిన మాటే చెప్పడంతో.. ఇంకోసారి సినిమా చూసిన సూపర్ స్టార్ శివాజీ కథని పక్కన పెట్టేసి తన 200వ చిత్రంగా ‘ఈనాడు’ ని ప్రకటించారు..
పరుచూరి బ్రదర్స్ పెన్ పవర్..
పరుచూరి బ్రదర్స్ ఒరిజినల్ వెర్షన్‌ని మన నేటివిటీకీ, కృష్ణ ఇమేజ్‌కి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేశారు.. ఆయనకు ఎంతో ఇష్టమైన అల్లూరి సీతా రామరాజు పేరునే రామరాజు అని పాత్రకు పేరు పెట్టారు.. నో హీరోయిన్, నో డ్యూయెట్స్.. ఉన్న నాలుగు పాటలూ కృష్ణ మీదనే.. 1982 జూన్ 9న మద్రాసులో చిత్రీకరణ ప్రారంభించారు. గుంటూరు, తెనాలితో పాటు రెండు రోజులపాటు క్లైమాక్స్ విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర షూట్ చేశారు.. రూ. 30 లక్షలు బడ్జెట్.. 35 వర్కింగ్ డేస్.. గుమ్మడికాయ కొట్టేశారు..
1982 డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్.. కట్ చేస్తే.. అప్పటికే కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ మీద తీసిన పొలిటికల్ సీన్స్, వేసిన సెటైర్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి.. కథ, కథనాల ముందు ఇతర కమర్షియల్ హంగులు పట్టించుకోలేదు.. ఫలితం సూపర్ డూపర్ హిట్.. దాదాపు రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 100, 175 రోజులు ఆడింది.. క్లైమాక్స్‌లో రామరాజు పాత్ర మరణించేటప్పుడు చెప్పే డైలాగ్స్ ప్రేక్షకాభిమానుల మనసుల్ని తాకాయి.. సూపర్ స్టార్ యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్, పరుచూరి బ్రదర్స్ రైటింగ్, రాఘవులు సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి..
తెలుగుదేశంకి సాయం..
సరిగ్గా ‘ఈనాడు’ షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడం.. ఈ చిత్రంలోని ‘రండి కదలి రండి’ పాటలో కృష్ణ సైకిల్ తొక్కడం.. ఎన్టీఆర్ పార్టీ గుర్తు కూడా సైకిల్ కావడం యాదృచ్ఛికం.. అలాగే తెలుగుదేశం పార్టీ విజయం సాధించినప్పుడు తన అభిమాన నటుడికి అభినందనలు తెలియజేస్తూ కృష్ణ పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. అప్పటికే ‘ఈనాడు’ వంద రోజుల రన్ పూర్తి చేసుకుంది..