ఏంటో ఒక్కోసారి కాంబినేషన్ బాగా సెట్ అయినా.. సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వదు. అశ్వినీదత్ (C. Aswani Dutt) – నాగార్జున (Nagarjuna) కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ హిట్లు ఎక్కువగా లేవు. మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) ..లది కూడా మంచి కాంబినేషన్. కానీ ఈ కాంబోలో సరైన బ్లాక్ బస్టర్ లేదు. సరిగ్గా ఇలాగే నందమూరి బాలకృష్ణ (Balakrishna) – ముత్యాల సుబ్బయ్య (Muthyala Subbaiah) ..ల కాంబినేషన్ గురించి చెప్పుకోవాలి. ఈ కాంబినేషన్లో ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ ‘పవిత్ర ప్రేమ’ (Pavitra Prema) ‘కృష్ణబాబు’ (Krishna Babu) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ఏదీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం మనం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ‘కృష్ణ బాబు’ సినిమా గురించి చెప్పుకుందాం.
Krishna Babu
ఇది బాలకృష్ణ కెరీర్లో 75 వ సినిమా. అంటే ల్యాండ్ మార్క్ మూవీ.దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు. ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) తో ఇండస్ట్రీ హిట్ కొట్టి బాలయ్య కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. ‘సుల్తాన్’ (Sultan) ఆడకపోయినా బాలయ్య రేంజ్ ఏమీ తగ్గలేదు. బాలకృష్ణ పేరు కూడా కలిసొచ్చేలా ‘కృష్ణబాబు’ (Krishna Babu) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇవి సరిపోవా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడానికి..! పైగా కోటి సంగీతంలో రూపొందిన పాటలన్నీ రిలీజ్ కి ముందు మార్మోగాయి. బాలయ్య ల్యాండ్ మార్క్ మూవీకి తగ్గ మ్యూజిక్ కోటి అందించారు.
అయితే 1999 సెప్టెంబర్ 16 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేదు. బాలకృష్ణతో పాటు అబ్బాస్ (Abbas), రాశి (Raasi) వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించారు. బాలకృష్ణ సరసన మీనా (Meena) హీరోయిన్ గా నటించింది. వారి ఇమేజ్ కూడా సినిమా ఫలితాన్ని మార్చలేకపోయింది. ‘కృష్ణబాబు’ (Krishna Babu) ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. కానీ సెకండాఫ్ తేడా కొట్టేసింది. ముఖ్యంగా హీరోయిన్ ను హీరో చంపడం అనే పాయింట్ వద్ద ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోయారు. సినిమా ఫలితం కూడా ఆ ఒక్క సీన్ దగ్గర మారిపోయింది.
ఇక సెకండాఫ్ లో బాలకృష్ణ- రాశి..లను కలిపేందుకు అబ్బాస్ చేసే ప్రయత్నాలు వంటివి కూడా… బాలయ్య రేంజ్ కి ఇమేజ్ కి సెట్ అవ్వలేదు. ఈ సినిమా రన్ టైం కేవలం 2 గంటల 5 నిమిషాలే ఉంటుంది. టైటిల్ కార్డులో బాలకృష్ణ పేరుకు ముందు ‘యుగాస్టార్’ అని పడుతుంది. ఫలితం తేడా కొట్టడంతో ఆ ట్యాగ్ ను మళ్ళీ బాలయ్య సినిమాలకి వాడలేదు. యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. నేటితో 25 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఫ్రీ టైం ఉంటే ఓ లుక్కేయండి: (నోట్: సినిమాలో పాటలైతే చాలా బాగుంటాయి!)