‘ఠాగూర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షియాజీ షిండే ఆ తరువాత ‘వీడే’ ‘గుడుంబా శంకర్’ ‘అతడు’ ‘సూపర్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘దేవదాసు'(2006) ‘పోకిరి’ వంటి చిత్రాలు ఇతని రేంజ్ ను మరింత పెంచాయనే చెప్పాలి. దాంతో ఇతనికి తెలుగులో కూడా వరుస అవకాశాలు లభించాయి.ఇతను ఓ మరాఠి నటుడు అయినప్పటికీ.. తాను నటించిన తెలుగు సినిమాల్లో 95శాతం పైగా సినిమాలకు అతనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. మరాఠి, తెలుగుతో పాటు హిందీ,తమిళ్, కన్నడ, మలయాళం,గుజరాతీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా ఇతను నటించాడు. ఇతను నటుడు కాకముందు వాచ్ మెన్ గా పనిచేసాడన్న సంగతి చాలా మందికి తెలీదు.
షియాజీ షిండే గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి. షియాజీ షిండే మాట్లాడుతూ… “నేను మహారాష్ట్రలో పుట్టాను. మాది చాలా పేద కుటుంబం. మా ఊర్లో ఏడో తరగతి వరకూ చదువుకున్నాను. తరువాతి చదువు కోసం రోజూ పక్క ఊరికి వెళ్ళేవాడిని. అలా టెన్త్ కంప్లీట్ చేశాను. అటు తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాను. అయితే అక్కడ ఫీజు కోసం అదే కాలేజీలో మూడేళ్లపాటు వాచ్ మెన్‌గా పనిచేసాను. పగలు చదువుకోవడం రాత్రి అదే కాలేజీలో వాచ్ మెన్‌గా చెయ్యడం. అలా వచ్చిన డబ్బులతో ఫీజ్ పట్టుకోవడంతో పాటు నా నెల ఖర్చులు కూడా సరిపెట్టుకునే వాడిని.అయితే1978, 79 సంవత్సరం టైములో నాటకాల పై ఇంట్రెస్ట్ తో అటు వైపు వెళ్ళాను.
అక్కడి నుండీ సినిమాల వైపు నా ప్రయాణం సాగింది. 1987లో చేసిన ‘జుల్వా’ అనే నాటకం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా మెల్లగా వెండితెర పై అడుగులు వేసాను. మరాఠీ సినిమాలతో నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం.. ఇక ఇప్పుడు అన్ని భాషల్లోనూ సినిమాలు చేసిన నటుడుగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఇక తెలుగు ప్రేక్షకులు అయితే నన్ను చాలా బాగా ఆదరించారు. నేను తెలుగులో నటించిన దాదాపు అన్ని సినిమాలకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. నాకు తెలుగు డైలాగులని .. దర్శక నిర్మాతలు హిందీ లేదా ఇంగ్లీష్ లో రాసి ఇస్తుంటారు. దానిని ప్రాక్టీస్ చేసి నేను డబ్బింగ్ చెప్పేవాడిని. ఇప్పుడు నాకు చాలా వరకూ తెలుగు వచ్చింది.” అంటూ చెప్పుకొచ్చాడు.