అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్, మెగాకోడలు ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ఉపాసనకు గోల్డెన్ వీసా అందించింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రిస్మస్ ఓ కానుక అందుకున్నానని తెలిపారు. ”ఇండియా ఎక్స్‌పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనుకుంటా ఈ క్రిస్మస్‌కు మంచి బహుమతి లభించింది. ‘వసుధైక కుటుంబం’.. ప్రపంచమంతా ఒకే కుటుంబం. యూఏఈ గోల్డెన్ విసా పొందడం సంతోషంగా ఉంది.
అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని. నేను అధికారికంగా గ్లోబల్ సిటిజన్” అని ట్వీట్ చేశారు ఉపాసన. ఇటీవల దుబాయ్ 2020 ఎక్స్‌పోను సందర్శించిన ఉపాసన.. అగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అసలు ఈ గోల్డెన్ వీసాతో బెనిఫిట్స్ ఏంటంటే.. సాధారణంగా యూఏఈలో ఉద్యోగం, వ్యాపారం, చదువు కోసం వెళ్లేవారికి అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది.
గోల్డెన్ వీసా ఉన్నట్టయితే నేషనల్ స్పాన్సర్ లేకుండానే యూఏఈలో ఉండొచ్చు. ఈ వీసా ఉంటే వంద శాతం యూఏఈ పౌరుడిగానే చూస్తారు. ఇప్పటివరకు ఇండియాకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఈ గోల్డెన్ వీసాను దక్కించుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్రలకు ఈ వీసా దక్కింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోణీ కపూర్ ఫ్యామిలీ కూడా ఈ గోల్డెన్ వీసాను దక్కించుకుంది.