ఒక శిల్పాన్ని అందంగా చెక్కుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న తప్పు దొర్లడం అనేది అత్యంత సాధారణంగా జరిగేది. అలాగే.. ఒక సినిమా తీస్తున్నప్పుడు లాజిక్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, క్యారెక్టర్స్ & క్యారెక్టరైజేషన్ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట సరిదిద్దుకోలేని తప్పు జరుగుతుంది. గతవారం విడుదలైన “నా పేరు సూర్య” విషయంలోనూ అదే జరిగింది. అయితే.. తన తప్పును దర్శకుడు వక్కంతం వంశీ స్వయంగా ఒప్పుకోవడమే కాక క్షమాపణ కోరడం గమనార్హం.
ఇంతకీ ఏమిటా తప్పు అనుకొంటున్నారా.. “సినిమాలో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన సూర్యను తండ్రి అర్జున్ గుర్తుపడతాడు కానీ.. తల్లి మాత్రం అర్జున్ చెప్పేవారకూ గుర్తుపట్టదు”. ఈ విషయాన్ని ఎవరూ మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఇటీవల ఓ కుర్రాడు డైరెక్ట్ గా వంశీని “తల్లి 12 ఏళ్ల తర్వాత కొడుకుని గుర్తుపట్టలేకపోయింది సరే.. కనీసం అతడి కంటి మీద ఉన్న ఘాటునైనా గుర్తుపట్టాలి కదా?” అని అడిగాడట. దాంతో “అన్నీ విషయాల్లో విపరీతమైన జాగ్రత్తలు తీసుకొన్న నేను ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను” అంటూ వంశీ కూడా ఫీల్ అయ్యాడట. ఈ విషయాన్ని పబ్లిక్ గా ఒప్పుకోవడం వంశీ గొప్పదనం అనే చెప్పుకోవాలి.