వరలక్ష్మీ శరత్ కుమార్… కోలీవుడ్‌లో చాలా రోజుల నుండి ఉంది. కథానాయికగా కొన్ని సినిమాలు చేసి ఆకట్టుకున్నా… అందరికీ గుర్తుండిపోయే పాత్రలు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే. ప్రతినాయిక పాత్రల చేయడానికి కూడా సై సై అనే వరలక్ష్మీకి రాజకీయ నాయకురాలి పాత్రలు కొట్టిన పిండి అనే చెప్పాలి. ఆమెకు బాగా పేరు తెచ్చిన పాత్రలు అవే. ‘తెనాలి రామకృష్ణ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అందులోనూ రాజకీయమే చేసింది. తాజాగా మరోసారి తెలుగు సినిమాల్లో నాయకురాలి వేషం వేయనుందని సమాచారం. ఈసారి స్టార్ హీరోకు పోటీగా రాజకీయం చేయనుందట.
మొన్న సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’లో జయమ్మ పాత్రతో అందరినీ మెప్పించి… టాలీవుడ్ జయమ్మగా అందరి మనసులో స్థానం సంపాదించుకుంది. వరు బయట ఎక్కడైనా కనిపిస్తే జయమ్మ అని పిలుస్తున్నారు. ఆ క్రేజ్ ఆమెకు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతోంది. తాజాగా అల్లు అర్జున్ సినిమాలో జయమ్మ అదేనండి వరలక్ష్మీని అడిగారట. అందులో ఓ కీలక పాత్రకు వరు అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. బన్నీ – కొరటాల సినిమా రాజకీయం బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందనే విషయం తెలిసిందే. సినిమా సెకండాఫ్‌లో పాలిటిక్స్ ఎంటర్ అవుతాయట. అప్పుడే జయమ్మ ఎంట్రీ కూడా ఇస్తుందట.
వరలక్ష్మీ కి సరైన పాత్ర దొరకాలి కానీ… తన టాలెంట్ మొత్తం చూపిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు కొరటాల సినిమాలో హీరో పాత్రకు ఎంత విలువ ఉంటుందో, మెయిన్ విలన్ పాత్రకూ అంతే విలువ ఉంటుంది. అంటే ఇప్పుడు వరు పాత్ర కూడా బలమైనదే అవుతుంది. ఆ లెక్కన బన్నీ వర్సెస్ జయమ్మ మస్తు రంజుగా ఉండబోతోంది అన్నమాట. ‘ఆచార్య’ తర్వాత కొరటాల, ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఈ కొత్త సినిమా పనిలో పడతారట. అప్పటివరకు ఈ వెయిటింగ్ తప్పదు.