టాలీవుడ్ హీరో వెంకటేష్ 90ల్లో నటించిన ‘కూలీ నెం.1’ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అప్పట్లో గోవిందా, కరిష్మా కపూర్ జంటగా దర్శకుడు డేవిడ్ ధావన్ ఈ సినిమాను రూపొందించారు. మళ్లీ పాతికేళ్ల తరువాత రీసెంట్ గా అదే టైటిల్ తో తన కొడుకు వరుణ్ ధావన్ ని హీరోగా పెట్టి సినిమా తీశారు. పాత కథకు కొత్త హంగులు అద్ది రూపొందించిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ మాస్ సినిమాను రిలీజైన 24 గంటల్లోనే అత్యధిక మంది వీక్షించారు.
కానీ ఈ సినిమాకి ఐఎండీబీలో వచ్చిన రేటింగ్ మాత్రం షాక్ ఇస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ సినిమాకి రాని విధంగా ఐఎంబీడీలో ప్రస్తుతం 1.3 రేటింగ్ తో కొనసాగుతుంది ‘కూలీ నెం.1’. ప్రేక్షకుల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టే ఈ రేటింగ్ ఇస్తారు. ఇప్పటివరకు పాతిక వేల మందికి పైగా రేటింగ్ ఇవ్వగా… దాని సగటు 1.3ని మించలేదు. గతంలో అజయ్ దేవగన్ ‘హిమ్మత్ వాలా’, సల్మాన్ ఖాన్ ‘రేస్ 3’ సినిమాలకు అతి తక్కువ రేటింగ్ లు వచ్చాయి.
ఇప్పుడు వాటిని పక్కకి నెట్టి అత్యంత తక్కువ రేటు తెచ్చుకున్న సినిమాల్లో మొదటి స్థానం దక్కించుకుంది ‘కూలీ నెం.1’. రాబోయే రోజుల్లో ఈ సినిమాకి రేటింగ్ కి ఏమైనా పెరుగుతుందేమో కానీ ఇప్పటికైతే రెస్పాన్స్ అంతా నెగెటివ్ గా ఉంది. ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన సినిమాను మరీ రొటీన్ గా, ఎలాంటి లాజిక్ లు పట్టించుకోకుండా తెరకెక్కించారు. ఆ కారణంగా ఈ సినిమాకి తక్కువ రేటింగ్ లు వస్తున్నాయి.