టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు హిట్ వస్తే సంతోషంతో పొంగిపోతూ ఫ్లాప్ అయితే మాత్రం డీలా పడుతూ ఉంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం హిట్ ఫ్లాపులకు అతీతంగా ఎప్పుడూ ఒకేలా ఉంటారు. అలా సక్సెస్ వచ్చినా ఫ్లాప్ ఎదురైనా ఒకేలా ఉండే హీరోలలో వెంకటేష్ ఒకరు. ఒక సందర్బంలో వెంకటేష్ మాట్లాడుతూ తాను అలా ఉండేందుకు అసలు కారణం ఏమిటో చెప్పుకొచ్చారు. ప్రతి మనిషికి లైఫ్ లో మూడు దశలు ఉంటాయని వెంకటేష్ చెప్పారు.
పని చేయడం, ఫలితం గురించి ఆలోచించకుండా ఉండటం, ఫలితం ఎలాంటిదైనా స్వీకరించడం మూడు దశలని మంచైనా, చెడైనా మనల్ని మనం స్వీకరించాలని వెంకటేష్ తెలిపారు. సినిమా హిట్టైతే మనమే గొప్ప అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని.. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మన పని అయిపోతుందనే భయం కలుగుతుందని ఈ రెండూ మంచివి కావని వెంకీ అన్నారు. సినిమా చివరి దశలో ఉన్న సమయంలోనే తాను మానసికంగా బయటకు వచ్చేస్తానని ఆ తరువాత తదుపరి చిత్రం గురించే ఆలోచిస్తానని వెంకటేష్ అన్నారు.
ఆ కారణం వల్లే హిట్లు, ఫ్లాపులు తనను మార్చలేకపోయాయని వెంకటేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప, దృశ్యం2, ఎఫ్3 సినిమాలలో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలపై ప్రేక్షకులో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్ నటిస్తున్న సినిమాలలో నారప్ప, దృశ్యం 2 సినిమాలకు ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో సురేష్ బాబు ఈ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేస్తారేమో చూడాల్సి ఉంది.