సినిమాల గురించి స్పందించే హక్కు, సినిమా ఎలా ఉందో చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే ఆ చెప్పే తీరు విషయంలో కాస్త ఆలోచించుకోవాలి. ఇదే కాదు, ఏ విషయం అయినా చెప్పడంలోనే అంతా ఉంది అంటారు. తాజాగా ఇలానే ఓ సినిమా గురించి మాట్లాడారు యువ దర్శకుడు వెంకటేశ్ మహా. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు గాంచిన వెంకటేశ్ మహా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ కన్నడ సినిమాపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ మేరకు ట్వటర్‌లో రెండు వీడియోలు పోస్ట్ చేశారు.
ఓ తాను ఒకానొక సందర్భంలో ఆ ఇంటర్వ్యూలో అన్న మాట.. మాట్లాడిన విధానం సరిగ్గా లేదని ఒప్పుకుంటానని కానీ.. నా అభిప్రాయం విషయంలో మాత్రం వెనక్కి తగ్గను అని అన్నారు. దీంతో ఆయన సారీ చెప్పారు కానీ.. సారీ చెప్పలేదు అని అనిపిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో రెండు రోజులుగా జరుగుతున్న చర్చ, పంచాయితీని ఇంకొన్ని రోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఆయన తన మాటలకు ఇంకా కట్టుబడి ఉన్నాను అని చెప్పారు. ఇంటర్వ్యూలో ఓ సినిమా మీద స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడం లేదని, అయితే బాధ్యత గల దర్శకుడిగా అలాంటి భాషలో మాట్లాడకుండా ఉండాల్సింది అని ఆయన చెప్పారు.
ఓ కల్పిత పాత్రను విమర్శించాను తప్ప, ఏ వ్యక్తినో, క్రియేటివ్ పర్సన్‌నో తాను కించపరచలేనది చెప్పారు. అంతే కాకుండా అదే ఇంటర్వ్యూలో మరో కన్నడ సినిమాని మెచ్చుకున్నానని కూడా చెప్పుకొచ్చారు వెంకటేశ్ మహా. చిన్న, పెద్ద అని కాకుండా అన్ని సినిమాలకి సమాన ఆదరణ ఎందుకు లేదు అన్నది మెయిన్ పాయింట్ అని చెప్పారు. దాంతోపాటు ఆయన మాట్లాడుతూ ఓ కల్పిత పాత్రను అన్నాననే కారణంతో రియల్ పర్సన్ అయిన నన్ను అసభ్యంగా దూషించడం, నా ఫోటోలను అసభ్యంగా క్రియేట్ చేయడం వంటివి చేస్తున్నారని చెప్పారు.
అలాగే సినిమాపై తన అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను అని కూడా చెప్పారు. దీంతో ఈ విషయం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానానికి సారీ చెప్పారు కానీ.. మాటలకు కాదు. అయితే ఇలా ఓ హిట్ సినిమాను ఎవరూ విమర్శించలేదా? విమర్శించకూడదా అంటే.. అలాంటి రూలేమీ లేదు అని చెప్పొచ్చు. అయితే విమర్శ తీసుకునేలా ఉండాలి, కోసుకునేలా కాదు అనే విషయం మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకుంటే సరి.