దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అభిరుచి ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు యువ డైరక్టర్ వేణు ఉడుగుల. ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ సినిమాలతో ఎమోషనల్ కథలను డీల్ చేయగలరు అనే పేరు తెచ్చుకున్నారాయన. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే సినిమాతో నిర్మాతగానూ తన అభిరుచిని చూపించారు. అయితే ఆయన నుండి దర్శకుడిగా సినిమా వచ్చి మూడేళ్లు అవుతోంది. ఇంతవరకు కొత్త సినిమా రావడం కాదు కదా, అనౌన్స్ కూడా కాలేదు. అయితే ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్ సమాచారం కాస్త వచ్చింది.
వెంకటేశ్‌తో వేణు ఉడుగుల ఓ సినిమా చేస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఇప్పుడు ఓ మల్టీస్టారర్ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. పెద్దింటి అశోక్ కుమార్ అనే ప్రముఖ రచయిత రాసిన ఓ నవలను ఆధారంగా తీసుకొని వేణు ఓ కథ రాసుకున్నారట. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతోందని సమాచారం. ఈ బ్యానర్‌తో వేణు ఊడుగుల చాలా ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమా విషయానికొస్తే.. వేణు సిద్ధం చేసుకున్న కథకు ఇద్దరు హీరోలు కావాలట. ఓ సీనియర్ హీరో, ఒక యువ హీరో ఉండాలట. ఇప్పటికే వేణు ఓ టాప్ హీరోకి కథ చెప్పగా ఆయన ఓకే చేసినట్లే చేసి లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అన్నారట. దాంతో ఆ కథను ఇతర భాషల హీరోల దగ్గరకు తీసుకెళ్లారట. ఇక యువ హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ ఫిక్సయ్యాడట. అన్నీ కుదిరితే త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. ఒకవేళ ఆయన ఇతర సినిమా పరిశ్రమకు చెందిన సీనియర్ హీరో ఓకే చెబితే.. మన హీరోలు, సీనియర్ నటులు ఎందుకు ఓకే చేయలేదు అనే ప్రశ్నలు వస్తాయి. చూద్దాం మరి ఏమవుతుందో?
