ఇప్పటివరకూ బోలెడుమంది నటులు యమధర్మరాజు పాత్ర పోషించినప్పటికీ.. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు “యముడు” అంటే గుర్తొచ్చే నటుడు కైకాల సత్యనారాయణ. మొన్నటి తరం, నిన్నటి తరం, నేటి తరం ఆర్టిస్టులందరితోనూ నటించిన అతికొద్ది సీనియర్ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. తెలుగు భాషకు వన్నె తెచ్చిన నటుల్లో కైకాల ప్రప్రధమంగా చెప్పుకోదగ్గ నటులు. అటువంటి అద్భుతమైన నటులు, వ్యక్తి ఇక లేరు. నేడు ఉదయం 4.00 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా ఇబ్బందిపడుతున్న ఆయన.. మంచానికే పరిమితమయ్యారు.
నవరస నటసార్వభౌముడిగా పేరొందిన కైకాల సత్యనారాయణ 770కి పైగా చిత్రాల్లో నటించారు. సిపాయి కూతురుతో తెరంగేట్రం చేసిన కైకాల 28 పోరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రాత్మక చిత్రాల్లో నటించారు. నాటక రంగం నుండి సినిమా వైపు అడుగులు వేసిన కైకాలను.. తెరంగేట్ర సమయంలో సీనియర్ ఎన్టీయార్ లా ఉన్నారంటూ కొనియాడేవారు. ఆ పోలికే ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. విఠలాచార్య దర్శకత్వంలో “కనకదుర్గ మహిమా” చిత్రంలో మొదటిసారిగా ప్రతినాయకుడిగా నటించిన కైకాల కెరీర్ కు ఎన్టీయార్ తో కలిసి నటించిన “అగ్గి పిడుగు” చిత్రంతో బ్రేక్ వచ్చింది.
ఎన్టీయార్ తో కలిసి దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించారు కైకాల. రావణాశరుడిగా, దుర్యోధనుడిగా, యముడిగా, ఘటోత్కచుడిగా కైకాల నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. “రామా ఫిల్మ్ ప్రొడక్షన్” అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. “కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు” లాంటి సినిమాలను నిర్మించారు కైకాల. రాజకీయాల్లోనూ నెగ్గుకొచ్చిన ఘనత కైకాలది. 1996లో టి.డి.పి తరపున మచిలీపట్నం నుండి లోక్ సభ స్థానానికి పోటీ చేసి భారీ మెజారటీతో గెలుపొందారు కైకాల.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన “రాముడు భీముడు” చిత్రంలో ఎన్టీయార్ డూప్ గా నటించారు కైకాల. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డ్ వంటివి కైకాల అందుకున్న గౌరవ పురస్కారాల్లో కొన్ని. కైకాల వంటి సీనియర్ నటులు మన మధ్య లేకపోవడం బాధాకరం. మరీ ముఖ్యంగా 2022 సంవత్సరంలో.. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి లెజండరీ నటులను కోల్పోవడం తెలుగు చిత్రసీమకు తీరని లోటు.