ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్ళపల్లి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అయన తుది శ్వాస విడిచారు. 850 కు పైగా చిత్రాల్లో నటించారు రాళ్ళపల్లి. కమెడియన్ గానూ అలాగే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ, సహాయ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులను అందుకున్నారు రాళ్ళపల్లి. 73 ఏళ్ళ వయసులో ఉన్న ఈ సీనియర్ నటుడు గత ఏడాది వరకూ కొన్ని సీరియల్స్ లో నటించి అలాగే కొన్ని టీవీ షోల్లో కూడా పాల్గొన్నారు.
1945లో ఆంధ్రప్రదేశ్ కంబదూర్ లో జన్మించిన రాళ్ళపల్లి చిన్న వయసులోనే నటన పై ఉన్న ఆసక్తితో పలు నాటకాల్లో నటించారు. ఆయనే స్వయంగా ఆ నాటకాలకు కథలు రాసి డైరెక్ట్ చేసుకోవడం విశేషం.రాళ్ళపల్లి నరసింహారావు 1979లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. జంధ్యాల, వంశీ వంటి క్రేజ్ ఉన్న నటులతో అయన పనిచేసారు. రాళ్ళపల్లి మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. అయన దూరమవ్వడం ఇండస్ట్రీకి పెద్ద లోటు అంటూ తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు కొందరు నటులు.