సినిమాకు నిర్మాతను తండ్రి లాంటివాడు అంటారు. ఆ సినిమాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాడు నిర్మాత. కొబ్బరి కాయ కొట్టే ముందు నుండి, గుమ్మడికాయ కొట్టి థియేటర్‌లోకి వచ్చేంతవరకు అంతా ఆయన ఆధ్వర్యంలోనే. అందుకే నిర్మాతగా మారడానికి చాలామంది ముందుకురారు. వచ్చినా ఒకానొక సమయంలో ‘నాకెందుకు సామి ఈ బాధ’ అనుకుంటారు. ఇప్పుడు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇదే. టాలీవుడ్‌లో అగ్రెసివ్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవకొండ ‘లైగర్’తో పాన్ ఇండియా హీరోగా మారాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో తనకు తెలసిన, తనను నమ్ముకున్న వారి కోసం చిన్న సినిమాల నిర్మాతగా మారాడు. ఈ క్రమంలో తన తమ్ముడు ఆనంద్ దేవకొండ సినిమాకు సమర్పకుడు అయ్యాడు. ఈ సినిమా ప్రచారంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నిర్మాతల కష్టాలు ఏకరవు పెట్టాడు. అంతేకాదు నాకెందుకీ బాధ అనుకుంటున్నా అని కూడా చెప్పాడు. ‘‘కెరీర్ ప్రారంభంలో నేను పడ్డ కష్టాలు మరొకరు పడకూడదనే కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి నిర్మాణ సంస్థను ప్రారంభించాను.
కానీ సినిమా నిర్మాణం చూసుకోవడం కష్టంగా ఉంది. ఓ నటుడిగా కథలు ఎంపిక చేసుకోవడం, పాత్రల కోసం శిక్షణ తీసుకోవడం లాంటివి చేసుకుంటున్నా. వీటికితోడు సినిమా ప్రచారం చేసుకోవడం కూడా ఉంది. ఇలా నా పని నాకే సరిపోతుంది. అలాంటిది ఇంకో సినిమాని నిర్మించి, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమంటే చిన్న విషయం కాదు. ఒక్కోసారి ఇదంతా మనకు అవసరమా అనిపిస్తుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు విజయ్.