“గీత గోవిందం, ట్యాక్సీవాలా” సినిమాలు లీక్ అయ్యాయి.. ఆన్ లైన్ లో జనాలు చాలా మంది షేర్ చేస్తున్నారంట అని తెలిసేసరికి షాక్ అయిపోయాను. అసలు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఒక్కసారిగా నన్ను ఎవరో పట్టుకొని కిందకి లాగేసినట్లు అనిపించింది. వెంటనే కోలుకొన్నాను. నా జీవితంలో ఈ పైరసీ కూడా ఒక మంచి మెమరీ అనిపించింది. ఇప్పటికీ కూడా అసలు నా సినిమాలు పైరసీ అవ్వకుండా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది” అంటూ “గీత గోవిందం” విడుదల సందర్భంగా తన తదుపరి చిత్రాలు లీక్ అవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. “గీత గోవిందం” రేపు విడుదలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాతో ముచ్చటించాడు.
ఎక్స్ పెక్ట్ చేశాను కానీ.. మరీ ఇంత బిజీ అయిపోతా అనుకోలేదు
హీరోగా కెరీర్ స్టార్ట్ చేయకముందు నుంచీ అలా చేయాలీ, చాలా బిజీ అయిపోవాలీ అనుకొన్నాను కానీ.. ఎంత బిజీ అయిపోయానంటే నా హెల్త్ కూడా సపోర్ట్ చేయడం లేదు. అసలు సరిగా నిద్రపోయి చాలా రోజులవుతుంది. సినిమా రిలీజ్ తర్వాత ఒకవారంపాటు వేరే పనులేవీ పెట్టుకోకుండా కేవలం పడుకోవడం, తినడం మళ్ళీ పడుకోవడం కోసం స్పెండ్ చేయాలి. అంతగా అలిసిపోయాను ఈమధ్యకాలంలో.
ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను..
ఒక్కోసారి నా సినిమా హోర్డింగ్స్, లాలిపప్స్ చూసి సడన్ గా షాక్ అయిపోతుంటాను. ఏంటి నా ఫోటోతో పోస్టర్స్ రోడ్డు మీద అది కూడా జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో వేయడమా అని ఆశ్చర్యపోతుంటాను. నాతోపాటు ఆ పోస్టర్స్ ను లక్షలమంది చూస్తుంటారు. భలే గమ్ముత్తైన అనుభూతి అది.
నా కెరీర్ నా కంట్రోల్ లో లేదు..
“అర్జున్ రెడ్డి” తర్వాత నా కెరీర్ నా కంట్రోల్ లో నుంచి బయటకి వెళ్లిపోయింది. అప్పటివరకూ నా కెరీర్ కోసం నేను పరుగులు పెట్టాను. కానీ ఇప్పుడు నా కెరీర్ వెనుక నేను పరుగులు పెడుతున్నాను. నా కెరీర్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందంటే.. దాని వెనుక పరిగెట్టడానికి నాకు ఓపిక లేనంత. ఇప్పుడు మళ్ళీ నా కెరీర్ పై నేను కంట్రోల్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నం మొదలెట్టాను. త్వరలోనే రిజల్ట్ కనిపిస్తుంది.
తప్పులు చేయడం సహజం..
జీవితంలో ప్రతి మనిషి ఎన్నో తప్పులు చేస్తుంటారు. కొందరు త్వరగా రియలైజ్ అవుతారు, కొందరికి లేట్ అవుతుంది. అలాగే నేను చాలా తప్పులు చేశాను. నాలో స్పెషాలిటీ ఏంటంటే నేను మిస్టేక్స్ చాలా కంఫర్టబుల్ గా చేస్తాను (నవ్వుతూ..). సో, కెరీర్ స్టార్టింగ్ లో సరైనా క్లారిటీ లేక కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకొన్నాను. ఇకపై అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను.
నా స్టార్ డమ్ ను ఎలా వాడుకోవాలో అర్ధం కావడం లేదు..
సినిమాల్లోకి రావడానికి ముందేమో పెద్ద హీరో అయిపోవాలి అని కలలు కన్నాను. కానీ.. ఇప్పుడు ఒక్కసారిగా ఇంతమంచి స్టార్ స్టేటస్ & ఇమేజ్ వచ్చేసరికి ఎలా దాన్ని బ్యాలెన్స్ చేయాలో అర్ధం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అసలు నాకు వచ్చిన స్టార్ డమ్ ను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు.
చిన్నప్పుడే బట్టల స్టోర్ పెట్టాలనుకొన్నాను..
ఇప్పుడేదో పాపులర్ అయ్యాను కాబట్టి “రౌడీ” బ్రాండ్ ను స్టార్ట్ చేశాను అని అందరూ అనుకొంటున్నారు కానీ.. స్కూల్ లో చదువుతున్నప్పట్నుంచి నాకంటూ ఒక బట్టల బ్రాండ్ ఉండాలి అని కలలు కనేవాడ్ని. అప్పుడు “లావా” అనే బ్రాండ్ తో బట్టలు తయారు చేయాలనుకొన్నాను. దానికి “ఫీల్ ది హీట్” అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ అయ్యాను. కానీ… అప్పటికి అది వర్కవుట్ అవ్వలేదు, ఇప్పుడు “రౌడీ’ వర్కవుట్ అయ్యింది.
సినిమాని సాధనంగా వాడుకొంటున్నాను..
ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు నేను చేయాలనుకొన్నవన్నీ ఇప్పుడు హీరో అయ్యాక చేస్తున్నాను. సింపుల్ గా చెప్పాలంటే సినిమాను, నా స్టార్ ఇమేజ్ ను నా కలలు నెరవేర్చుకోవడం కోసం ఒక సాధనంగా వాడుకొంటున్నాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ.. ఏదీ శాశ్వతం కాదు అనే ఫిలాసఫీతో ముందుకు వెళుతున్నాను. భవిష్యత్ లో ఏమవుతుందో చూడాలి.
చిన్నప్పుడు సంగీతం నేర్చుకుంటే బాగుండేది..
స్కూల్లో సంగీతం క్లాసులు, స్పోర్ట్స్ పీరియడ్ టైమ్ లో జరిగేవి. నాకు కూర్చుని సంగీతం నేర్చుకోవాలంటే బోర్ కొట్టేడు. డుమ్మా కొట్టి గేమ్స్ ఆడుకోవడానికి వెళ్లిపోయేవాడ్ని. “వాట్ ది లైఫ్” సాంగ్ కి రెస్పాన్స్ చూశాక చిన్నప్పుడు ఆ క్లాస్ కి సరిగ్గా వెళ్ళి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఆ పాట నేను పాడాలి అనేది డైరెక్టర్ ఛాయిస్. నేను కూడా సరదాగా ట్రై చేద్దామని కేవలం 45 నిమిషాల్లో పాడేశాను. కానీ.. జనాలు ట్రోల్ చేసేసరికి భయమేసింది. కొన్ని ట్రోల్స్ చూసి నవ్వుకొన్నాను, కొన్నిటికి బాధపడ్డాను.
నాకు అడ్వైజ్ లు నచ్చవు..
నేను చేసిన పనిని బాలేదు అని చెప్పండి, అసహ్యంగా ఉందని చెప్పండి ఒప్పుకొంటాను. ఎందుకంటే నీ ఒపీనియన్ నువ్ షేర్ చేసుకొంటున్నావు. కానీ.. కొందరు ఏకంగా “నువ్ పాడడం మానేయ్” అన్నారు. ఇంట్లో మా అమ్మ, అయ్యా చెప్పిందే ఎప్పుడూ వినలేదు. ఇక ఎవడో చెప్పింది నేను ఎందుకు వింటాను.
ఓవర్సీస్ ఆడియన్స్ కి మాత్రమే ఆ అదృష్టం..
వచ్చిన ట్రోల్స్ అన్నీ చూసిన తర్వాత ఎవరైనా కొత్త సింగర్ ని పరిచయం చేద్దామని ఒక కాంటెస్ట్ పెట్టాను. చాలా మంది ఆ పాట పాడి పంపించారు. ఒక ఇద్దరివి నాకు బాగా నచ్చాయి. అయితే.. ఆ వాయిస్ లు సినిమాకి పనికిరావు అని మా డైరెక్టర్స్ & ప్రొడ్యూసర్ రిజెక్ట్ చేశారు. దాంతో ఒక ప్రొఫెషనల్ సింగర్ తోనే ఆ పాట పాడించాము. అయితే.. అప్పటికే యూఎస్ ప్రింట్స్ డిస్పాచ్ అయిపోవడంతో ఓవర్సీస్ ప్రింట్ లో నా వాయిస్ ఉంటుంది. ఇండియన్ వెర్షన్ లో మాత్రం నా వాయిస్ ఉండదు. సో, నా గొంతు వినే అదృష్టం కేవలం ఓవర్సీస్ ఆడియన్స్ కు మాత్రమే.
అర్జున్ రెడ్డితో గీత గోవిందంకి ఉన్న సంబంధం అదే..
“అర్జున్ రెడ్డి” తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తో రిలీజవుతున్న సినిమా “గీత గోవిందం”. అసలు ఇంత గ్యాప్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు అది వేరే విషయం అనుకోండి. అయితే.. ఈ రెండు సినిమాల మేకింగ్ & టేకింగ్ డిఫరెంట్ తప్పితే సినిమాలోని ఎమోషన్ ఒకటే. “అర్జున్ రెడ్డి”లో అర్జున్ తన ప్రేమను దక్కించుకోవడం కోసం ఎంత ఎక్స్ట్రీమ్ లోకి వెళ్లాడో “గీత గోవిందం” చిత్రంలో విజయ్ గోవిందం అలియాస్ గోవిందం కూడా తన ప్రేయసి కోసం తనకి వీలైన స్థాయి ఎక్స్ట్రీమ్ లెవల్ కి వెళ్ళిపోతాడు. అందుకే.. ఆ సినిమా తర్వాత ఇదే కరెక్ట్ రిలీజ్ అనిపిస్తుంది.
“ట్యాక్సీవాలా” ఎప్పుడు రిలీజైనా హిట్టే..
నిజానికి “గీత గోవిందం” కంటే ముందు “ట్యాక్సీవాలా” రిలీజ్ అవ్వాలి కానీ.. సీజీ వర్క్ అవుట్ పుట్ సరిగా అవ్వలేదు. సినిమాలో చాలా సీజీ వర్క్ ఉంది. అందుకే సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. కానీ.. నా మనసుకి బాగా నచ్చిన సినిమా “ట్యాక్సీ వాలా”. ఆ సినిమా ఎప్పుడు రిలీజైనా హిట్ అవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం.
గీత గోవిందం సక్సెస్ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుంది..
ఈ సినిమాలో నేను మంచినా పెర్ఫార్మ్ చేశాను అని కానీ.. సినిమా బాగుందని కానీ టాక్ వచ్చిందంటే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం మా డైరెక్టర్ పరశురామ్ కే చెందుతుంది. నా చేత గోవిందం పాత్రలో నటింపజేయడం మొదలుకొని సినిమాని అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాని తీర్చిదిద్దాడు. సినిమా ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అబ్బాయి అవినాష్ కూడా సినిమాలోని డైలాగ్స్ ఏమీ అర్ధం కాకపోయినా కేవలం సన్నివేశాలు చూసి తెగ నవ్వేస్తున్నాడు. అప్పుడు అర్ధమైంది సినిమా తప్పకుండా అందర్నీ ఆకట్టుకొంటుందని.