పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నారు. అతను నటించిన టాక్సీవాలా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక గీత గోవిందం, నోటా చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం మొన్ననే మొదలయింది. వీటి తర్వాత “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు” ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి విజయ్ ఓకే చెప్పారు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి హీరోయిన్ ని ఎన్నుకోవడం చాలా కష్టమైంది.
స్టార్ హీరోయిన్స్ విజయ్ తో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. కొత్త అమ్మాయిని తీసుకుందామంటే బిజినెస్ పై ప్రభావం చూపిస్తుందని ఇబ్బంది పడ్డారు. అయితే తాజాగా ఇందులో నటించడానికి టాలీవుడ్ యువరాణి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. క్రాంతిమాధవ్ చెప్పిన కథ, అందులో తన క్యారక్టర్ బాగుండడంతో విజయ్ కి జోడిగా ఓకే చెప్పింది. ఈ జోడి తెరపైన కొత్తగా కనిపించనుంది. సీనియర్ హీరోయిన్, జూనియర్ హీరోల కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు విజయం సాధించాయి. ఈ చిత్రం విషయంలోనూ అదే రిపీట్ అవుతుందేమో చూడాలి.