టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చివరిగా ‘లైగర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో విజయ్ కాస్త డీలా పడ్డారు. తన నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా విజయ్ ఓ హాస్పిటల్ కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ న్యూస్ బయటకు పెద్దగా రాలేదు కానీ విజయ్ దేవరకొండ అయితే ఈ మీటింగ్ లో ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సదరు హాస్పిటల్ అలానే అందులో డాక్టర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు విజయ్ దేవరకొండ. తాను ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నటించే సమయంలో తన తండ్రికి ఆరోగ్యం బాలేదని.. ఆ సమయంలో ఇదే హాస్పిటల్ వారిని సంప్రదించగా.. తన తండ్రికి నయం చేశారని చెప్పారు.
ఇప్పుడు తన తండ్రి మునుపటి కంటే ఎంతో ఫిట్ గా ఉన్నారని తెలిపారు. అందుకే వారు ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి వచ్చానని విజయ్ చెప్పారు. వారితో మాట్లాడుతూ.. ఆర్గాన్ డొనేషన్ గురించి తెలుసుకున్నానని.. ఈ డోనార్స్ వలన ఎంతోమంది జీవితాలు రీస్టార్ట్ అవ్వడం అనేది బాగా అనిపించిందని విజయ్ తెలిపారు. అందుకే తను కూడా అవయవదానం చేశానని చెప్పారు విజయ్ దేవరకొండ.
తన తరువాత తన అవయవాల వలన ఎవరో ఒకరు బ్రతకడం వారిలో తను కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ. ఈ విషయం తెలుసుకున్న విజయ్ ఫ్యాన్స్.. అతడి హ్యాట్సాఫ్ చెబుతూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య కోవిడ్ సమయంలో కూడా చాలా మందికి అండగా నిలిచారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈ నిర్ణయంతో మరో మెట్టు ఎక్కేశారు విజయ్ దేవరకొండ.