ప్రెజంట్ జనరేషన్ కి పరిచయం అవసరం లేని ముఖం విజయ్ దేవరకొండ. “గీత గోవిందం” చిత్రంతో సునాయాసంగా వంద కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకొన్న విజయ్ దేవరకొండ ఈసారి పోలిటికల్ డ్రామా “నోటా”తో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. రేపు తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ మాత్రమే కాక ఆయన అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకొన్నారు. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా గురించి, పాలిటిక్స్ మీద తన అభిప్రాయం గురించి విజయ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..!!
“నోటా” వల్ల చాలా అలిసిపోయాను.. నేను నా ప్రతి సినిమాని వీలైనంతవరకు ప్రమోట్ చేస్తాను. కానీ.. “నోటా”కి డబుల్ ప్రమోషన్స్ చేసినట్లు అనిపించింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తుండడం వల్ల చెన్నైలో కొన్నాళ్లు, ఇక్కడ కొన్నాళ్లు పోలోమని ప్రమోషన్స్ చేయడం వల్ల బాగా అలిసిపోయాను. ఆల్మోస్ట్ రోజుకి 8 ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. రేపాటితో ఈ ఇంటర్వ్యూల ప్రహసనం ముగుస్తుంది. సరిగ్గా నిద్రపోయి చాలా రోజులైంది. రేపు రిలీజ్ అయ్యాక రిజల్ట్ బట్టి ప్రశాంతంగా నిద్రపోతాను.
గీత గోవిందం పైరసీ ఎక్కువగా డిస్టర్బ్ చేసింది.. నా ప్రతి సినిమాకి ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంది. సో, బేసిగ్గా నేను వాటికి అలవాటుపడిపోయి.. పట్టించుకోవడం కూడా మానేశాను. కానీ.. “గీత గోవిందం” రిలీజ్ కి ముందే లీక్ అవ్వడం మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అప్పట్నుంచి నా సినిమాల పైరసీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకొంటున్నాను.
ఆ కాంట్రవర్సీల్ని ప్రమోషన్ కోసం వాడేశాను.. “నోటా” సినిమా విషయంలో జరుగుతున్న గొడవలు చూస్తూనే ఉన్నాను. కొన్ని పోలిటికల్ పార్టీస్ చేస్తున్న రచ్చలు కాస్త ఎక్కువే అనిపిస్తున్నాయి కానీ.. అవన్నీ నా సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకొంటున్నాను. ఇప్పుడు నోటా మీద జరుగుతున్న గొడవల్ని కూడా నా సినిమాకి కలెక్షన్స్ తెప్పించే విధంగా కన్వర్ట్ చేసుకొంటాను.
దర్శకులు నన్ను నమ్ముతున్నారు.. “పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం” ఇప్పుడు “నోటా” లాంటి డిఫరెంట్ సినిమాలు నేను చేయగలుగుతున్నాను అంటే ఆ క్రెడిట్ మొత్తం దర్శకులకే చెందుతుంది. ఎందుకంటే.. నేను వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్నాను కాబట్టి విభిన్నమైన కథలు నా దగ్గరకు వస్తున్నాయి. భవిష్యత్ లో కూడా ఇలాంటి కథలే నా దగ్గరకి రావాలి, ఈ తరహా సినిమాలే నేను చేయాలి అని కోరుకొంటున్నాను.
తమిళనాడు పాలిటిక్స్ గురించి ఏమీ తెలీదు.. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు రాజకీయ పరంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసు కానీ.. తమిళనాడు పాలిటిక్స్ గురించి మాత్రం అస్సలు ఏమీ తెలియదు. “నోటా” మూవీ తమిళ ప్రేక్షకులు ఎక్కువగా ఎందుకు కనెక్ట్ అవుతుంది అని నేను అనడానికి కారణం ఏంటంటే.. సినిమాలో పాలిటిక్స్ గురించి ఉన్న సన్నివేశాలన్నీ తమిళనాడులో ఇటీవల జరిగిన ఇష్యూస్ ఉంటాయి.
కేటీయార్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నా.. “నోటా” సినిమాలో నేను పోషించిన పొలిటీషియన్ పాత్రకు స్పూర్తి అంటే కేటీయారే. డ్రెస్సింగ్ & బాడీ లాంగ్వేజ్ పరంగా డిట్టో ఆయన్ని దింపేశాను. నాకు కేటీఆర్ లో నచ్చేది ఏంటంటే.. ఆయన కొందరు పొలిటీషియన్స్ లా కెమెరా ముందు మాత్రమే కాక ఆఫ్ ది కెమెరా కూడా పాలిటిక్స్ గురించి, సొసైటీ గురించి ఆలోచిస్తుంటాడు ఆయన. ఆయన విధివిధానాలు నచ్చే నేను లాస్ట్ ఎలెక్షన్స్ లో టి.ఆర్.ఎస్ కు ఓటు వేశాను, నెక్స్ట్ ఎలెక్షన్స్ లో కూడా ఆ పార్టీకే ఓటు వేస్తాను.
చంద్రబాబు నాయుడు గారి విధానాలు నాకు చాలా ఇష్టం.. నాకు తెలిసి చిన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరూ చంద్రబాబు నాయుడు గార్ని తెగ తిట్టుకొనేవారు. అందుకు కారణం ఆయన “చెక్ ఇన్”ను గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంట్రడ్యూస్ చేశారు. అందువల్ల అందరూ టైమ్ కి వెళ్ళేవారు. నాకు అది బాగా నచ్చేది.
క్లీన్ యు ఇవ్వడం చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను.. నా సినిమాలకి చాలా రోజుల తర్వాత “క్లీన్ యు” సర్టిఫికెట్ వచ్చింది (తమిళంలో). నాకే సిగ్గు అనిపించింది నా సినిమాకి “యు” ఇవ్వడం ఏంటీ, ఇప్పుడు నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి అని. తెలుగులో నా మొహం చూసి ఈడికి “యు” ఎందుకులే అని “యు/ఎ” ఇచ్చారు (నవ్వుతూ..).
ఆ పెద్దాయన అలా రిక్వెస్ట్ చేయడం ఎక్స్ పెక్ట్ చేయలేదు.. ఒకసారి చెన్నై వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో ఒక పెద్దాయన కలిసాడు. “బాబు నీ సినిమాలంటే నాకు, మా అమ్మాయిలకు చాలా ఇష్టం. కానీ.. కాస్త బూతులు తగ్గించండి” అని రిక్వెస్ట్ చేసాడు. నాకు ఇప్పటివరకూ వచ్చిన ‘ఉచిత సలహాల్లో’ నాకు నచ్చింది అదొక్కటే.
బ్యానర్ నేమ్ వెనుక ఉన్న అసలు రీజన్ అదే.. నా ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ కోసం “కింగ్ ఆఫ్ ది హిల్” అనే పేరు పెట్టాను. త్వరలోనే ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఇస్తాను. అయితే.. కింగ్ ఆఫ్ ది హిల్ అంటే అర్ధం ఏంటంటే.. “దేవరకొండ” అనే ఇంటి పేరుకి ఇంగ్లీష్ మీనింగ్ లా అది వస్తుంది. అందుకే అలా పెట్టాను.
మన ప్రభుత్వాలకు ముందుచూపు లేదు.. ఒక సామాన్యుడిగా నేను రాజకీయాల్లో పరిశీలించింది ఏంటంటే.. ఏదైనా సమస్య వచ్చాక దానికి సోల్యూషన్ ఆలోచిస్తారు కానీ.. ముందు ఆ సమస్య రాకుండా ఏం చేయాలి అని మాత్రం ఆలోచించరు. ఆ ముందుచూపు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సమాజం బాగుపడుతుంది. అందుకు ప్రజలు కూడా సహకరించాలి.