తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Vijay Thalapathy) పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొనాలని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళగ వెట్రిగ కజగం పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన విజయ్, త్వరలోనే తమిళ రాజకీయాల్లో బిగ్ ఫైట్ ఇస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన పార్టీ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. అయితే, రాజకీయ ఎంట్రీని మరింత సమర్థంగా మార్చుకునేందుకు విజయ్ పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (PK) సహాయాన్ని తీసుకోనున్నట్టు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, విజయ్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పీకే కూడా విజయ్ ప్రతిపాదనలకు ఓకే చెప్పినట్టు తెలుస్తున్నా, ఇంకా అధికారిక ఒప్పందం జరగలేదని సమాచారం. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే, విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి పెద్ద నాయకులకు పొలిటికల్ వ్యూహాలను రూపొందించిన పీకే, ఇప్పుడు విజయ్ కోసం ప్రత్యేకంగా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారట.
ఈ వ్యూహంలో ప్రధానంగా రెండు కీలక కార్యక్రమాలపై పీకే దృష్టి పెట్టారని చెన్నై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదటగా, విజయ్ బలమైన మాస్ కనెక్షన్‌ను పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రజా యాత్రను చేయాలని ఆయన సూచించినట్టు సమాచారం. జగన్ మాదిరిగా పాదయాత్ర చేయడం, లేదా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలో బస్సు యాత్ర నిర్వహించడం అనే ఆలోచన పీకే పక్కాగా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. విజయ్ పార్టీకి స్ట్రాంగ్ గ్రౌండ్ వర్క్ అందించేందుకు పీకే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నారని టాక్.
ఇప్పటికే పీకే తన సంస్థ ఐప్యాక్ నుంచి వైదొలగి, వ్యక్తిగతంగా వ్యూహాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయిన పీకే, ఇప్పుడు విజయ్‌తో కలిసి తమిళ రాజకీయాల్లో ఓ కొత్త యాంగిల్ తీసుకురాబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం విజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఒకవేళ పీకే వ్యూహాలు విజయవంతం అయితే, తమిళ రాజకీయాల్లో విజయ్ పార్టీ ప్రభావం భారీగా ఉండే అవకాశముంది.