దళపతి విజయ్ కెరీర్‌లో భారీ సినిమాలు అంటే రెడీ అయ్యే లిస్ట్‌లో ‘పులి’ కచ్చితంగా ఉంటుంది. భారీ తారగణం, అంతకుమించిన సెట్స్‌తో ఈ సినిమాతో విజయ్ కెరీర్‌లో అదిరిపోయే సినిమాగా వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో నటులు ఉండటంతో భారీ స్థాయిలో ప్రచారం కూడా చేశారు. కానీ థియేటర్ల దగ్గర సినిమాకు ఊహించని పరాభవం ఎదురైంది. సినిమా టీమ్ మొత్తం చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఆ సినిమా ఫలితం విజయ్ కెరీర్‌కు కాస్త ఇబ్బందికరంగా మారింది కూడా.
ఫ్యాన్స్ అయితే ఆ సినిమా చూసి చివుక్కుమన్నారు. అయితే ఆ సినిమా వచ్చి ఇన్నాళ్లయినా ఇంకా విజయ్‌ను ఇబ్బందిపెడుతూనే ఉంది. అయితే ఈసారి విజయ్ వైపు నుండే సమస్య అంటున్నారు. గతంలో ఫలితం ప్రకారం ఇబ్బంది పెడితే… ఇప్పుడు ఆర్థిక పరంగా సమస్యలు తీసుకొచ్చింది. ఆ సినిమా ఆదాయం లెక్కల్లోకి చూపించలేదంటూ ఆదాయపు పన్ను శాఖ నివేదిక సిద్ధం చేసింది. విజయ్‌కు రూ.1.50 కోట్ల జరిమానా విధించిన విషయమై ఆదాయపన్ను శాఖ మద్రాసు హైకోర్టులో నివేదిక దాఖలు చేసింది.
2015-16 ఆర్థిక సంవత్సరానికి విజయ్ ఐటీ రిటర్ను దాఖలు చేసినప్పుడు ఆ ఏడాది ఆదాయం రూ.35,42,91,890గా చూపించాడట. అయితే ఆదాయపన్నుశాఖ లెక్కలు చూసేటప్పుడు ‘పులి’ సినిమాకు తీసుకున్న రూ.15 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని తెలిసింది. విజయ్ ఇంట్లో 2015 సెప్టెంబరు 30న జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఈ విషయం బయటపడిందట. దీంతో ఆదాయాన్ని దాచినందుకు రూ.1.50 కోట్ల జరిమానా విధిస్తూ ఆదాయపన్నుశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని రద్దు చేయాలని విజయ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ విచారించిన హైకోర్టు ఆదాయపన్నుశాఖ ఉత్తర్వులకు మధ్యంతర నిషేధం విధించింది. పిటిషన్‌పై ఆదాయపన్ను శాఖ జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్ మంగళవారం విచారణ నిర్వహించారు. విజయ్‌కు రూ.1.50 కోట్లు జరిమానా విధించాల్సి వచ్చిందో ఐటీ శాఖ కోర్టుకు వివరాలు సమర్పించింది. దీంతో న్యాయ స్థానం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. దీంతో ఈ విషయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన విజయ్ (Vijay) అభిమానుల్లో కనిపిస్తోంది.