పోస్టర్, టీజర్, ట్రైలర్ చూసి… సినిమాను ఓ అంచనా వేయకూడదు అని అంటుంటారు పెద్దలు. గతంలో చాలా సినిమాల విషయంలో ఇలానే జరిగింది. సినిమాలో ఏముందో తెలియకుండా… ఏదో ఫొటో, వీడియో క్లిప్ చూసి ‘మనోభావాలు’ అంటూ ముందుకొచ్చేస్తుంటారు. ఇటీవల కాలంలో అలా ‘మనోభావాల’ మ్యాటర్ వచ్చిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసినప్పడు లాస్ట్ ఫ్రేమ్‌లో ఎన్టీఆర్‌ను ముస్లింగా చూపించారు. దీంతో చాలా రకాల వాదనలు వినిపించాయి. తాజాగా వీటికి సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
నిజాం రాజుల మీద, రజాకార్ల మీద యుద్ధం చేసిన కొమురం భీమ్ పాత్రను… ముస్లిం టోపీ పెట్టుకుని చూపించడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆదివాసీలు అయితే ఆ సన్నివేశం విషయంలో మండిపడ్డారు. సినిమా నుండి ఆ సీన్లు తొలగించాలని డిమాండ్ చేశారు. చరిత్రను వక్రీకరిస్తే సినిమా విడుదలయ్యాక థియేటర్ల మీద దాడిచేస్తామని హెచ్చరించారు. అయితే రాజమౌళి, విజయేంద్రప్రసాద్ మరీ చరిత్రను మార్చి చూపించరని కొంతమంది అనుకున్నారు. ఎన్టీఆర్‌ను అలా చూపించడం వెనుక ఏదో కారణం ఉందని అనుకున్నారు. అలా అనుకున్నవాళ్ల ఆలోచనే కరెక్ట్ అయ్యింది.
సినిమా గురించి, అందులో ఎన్టీఆర్ పాత్ర గురించి ఇటీవల విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. సినిమాలో కొమురం భీమ్ ప్రతిష్టకు భంగం కలిగించే సన్నివేశాలేవీ లేవని తేల్చి చెప్పేశారు. ఎన్టీఆర్ తల మీద ఆ టోపీ ఎందుకు ఉందనేది సినిమా చూస్తే అర్థమవుతుందని చెప్పారు. కొమురం భీమ్ అజ్ఞాతంలో ఉన్నప్పుడు నిజాం రాజులు,రజాకార్ల దృష్టిలో పడకుండా ఉండటానికి చాలా వేషాలు వేశారు. అందులో భాగంగానే ఓసారి ఇలా కనిపించి ఉండొచ్చు అని చిత్ర సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా విషయం క్లారిటీగా తెలియాలంటే సినిమా రావాల్సిందే.