సినిమా రిలీజ్ అవుతోంది అనగానే… బాగా బజ్ తీసుకొచ్చే అంశం అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్లు. గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో వీటి గురించి తెగ వింటున్నాం కూడా. సరైన అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్లు లేకుండా వచ్చే సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఆ విషయం పక్కనపెడితే.. ఇటీవల ఓ సినిమా కోసం ఓవర్సీస్‌లో ప్రీమియర్లు వేద్దాం అనుకుని, అంతా రెడీ చేసి ఆ ప్రయత్నాలు విరమించుకున్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు.
రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘స్కంద’. ఈ సినిమాలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈ నెల 15న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా మీద ఇటు రామ్‌కు, అటు బోయపాటికి భారీ అంచనాలు, నమ్మకాలు ఉన్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్‌కు సరైన విజయం లేదు. బాలకృష్ణతో చేసే సినిమాలు తప్ప ఇతర హీరోలతో చేసే సినిమాలు బోయపాటికి పెద్దగా కలసి రావడం లేదు. దీంతో ‘స్కంద’ ఈ రెండు మచ్చలను చెరిపేయాలని అనుకుంటున్నారు.
ఈ క్రమంలో ‘స్కంద’కు (Skanda) ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ వేయాలని తొలుత నిర్మాతలు అనుకున్నారు. అయితే సడన్‌గా ‘వినయ విధేయ రామ’ ఫలితం గుర్తొచ్చి ఆ ప్రయత్నాలు ఆపేశారు అని చెబుతున్నారు. ఆ సినిమాకు బ్యాడ్ టాక్ ప్రీమియర్ల నుండే మొదలైంది అని చెప్పాలి. అందులో ఫైట్స్, కొన్ని సన్నివేశాల విషయంలో రివ్యూయర్లు ఏకిపారేయడానికి ముందే ఓవర్సీస్ ప్రేక్షకులు తూర్పారపట్టేశారు. ఇప్పుడు ‘స్కంద’ ట్రైలర్‌లో అలాంటివి వైబ్స్ కనిపించాయి. నరకడాలు, ఎగరడాలు, అరవడాలు, దూకడాలు ఇలా చాలానే ఉన్నాయి.
‘వినయ విధేయ రామ’ సినిమా సమయంలో ఇవన్నీ ఇబ్బంది పెట్టాయి. ఓవర్సీస్‌లో నెగిటివ్ టాక్‌ను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ‘స్కంద’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్తగా ఓవర్సీస్ అడ్వాన్స్‌డ్ ప్రీమియర్ల ఆలోచనను పక్కన పెట్టేశారని సినిమా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నిజమెంత ఉందో త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుంది.